ప్రజాకాంక్షలు నెరవేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని.. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహించి.. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేస్తామని చెప్పారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. ఫిబ్రవరి 8వ తేదీ గురువారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీకి హాజరై గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
గవర్నర్ మాట్లాడుతూ.. త్వరలో రెండు గ్యారంటీలు.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ తోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, యువతకు 2 లక్షల ఉద్యోగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని.. మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారామె.రాష్ట్రంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఇ విధానం తెస్తామని చెప్పారు. వెయ్యి ఎకరాల్లో 10 నుంచి 12 ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. విదేశీ కంపెనీలతో కొత్తగా రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు.
టిఎస్పిఎస్సీ, ఎస్ హెచ్ఆర్ సి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వచ్ఛను కల్పిస్తామన్నారు. టిఎస్పిఎస్సీ పూర్తిగా ప్రక్షాళన చేశామని.. త్వరలోనే గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని చెప్పారు. రూ.2వేల కోట్లతో ఐఐటీలను ఆప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. త్వరలో గ్రీన్ ఎనర్జీ విధానాన్ని తీసుకొస్తామని... రాష్ట్రంలో ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్ లుగా హుస్సేన్ సాగర్, లక్నవరం చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పర్యాటకరంగ అభివృద్ధి కోసం వారసత్వ కట్టడాల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆలయాలు, చెరువుల అభివృద్ధి కోసం సమగ్ర పర్యటాక విధానం తీసుకొస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో కుల గణన సర్వే చేపట్టనున్నట్లు గవర్నర్ వెల్లడించారు.