వరద బాధితులకు సాయం చేయండి

  • రెడ్‌క్రాస్‌ యూనిట్లకు గవర్నర్‌‌ తమిళిసై సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆపదలో ఉన్న ప్రజలకు సహాయ పడాలని జిల్లాల రెడ్ క్రాస్ యూనిట్లకు గవర్నర్ తమిళిసై సూచించారు. వృద్ధులు, గర్భిణులు, అత్యవసర వైద్య సాయం అవసరం ఉన్నవారు, దివ్యాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, యువత సహాయ సహకారాలను తీసుకోవాలన్నారు. 

గురువారం రాజ్ భవన్ నుంచి 33 జిల్లాల రెడ్ క్రాస్ యూనిట్ల ప్రతినిధులతో గవర్నర్ వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు జిల్లాల్లో వర్షాలు, వరదల ప్రభావాన్ని గవర్నర్‌‌కు వివరించారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సహాయక చర్యలు ప్రారంభించామని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థల సహాయం కూడా తీసుకోవాలని తమిళిసై సూచించారు. నిత్యవసర వస్తువులు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఫుడ్‌తో పాటు తదితరాలను ప్రజలకు అందజేయాలన్నారు. 

ALSO READ:మెడికల్ పీజీ, యూజీ సీట్లలో ఓపెన్ కోటా లొల్లి

ఏదైనా అవసరం ఉంటే గవర్నర్ ఆఫీస్ నుంచి సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ మేరకు రాజ్ భవన్ సెక్రటరీని సంప్రదించాలని తమిళిసై సూచించారు. ఈ ఏడాది కూడా రాజ్ భవన్‌లో విరాళాల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రాతో పాటు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.