ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితి దారుణం....కొత్త భవనం నిర్మించాల్సిందే

ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆసుపత్రిలోని టాయిలెట్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని..డోర్లు సరిగా లేవన్నారు. రోజుకు 2వేల మంది ఔట్‌ పేషెంట్లు వస్తున్నారని... ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు బాధపడుతున్నారని చెప్పారు. ఆసుపత్రి జనరల్‌ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తున్నాయని... ఎండ వేడి తట్టుకోలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం కట్టాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా ఆసుపత్రికి రాలేదని  తమిళిసై అన్నారు. న్యాయస్థానంలో వివాదం ఉందని ప్రభుత్వం చేతులు దులుపుకోండం కరెక్ట్ కాదన్నారు. రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. 
 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన తమిళిసైకి ఉస్మానియా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శశికళ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆసుపత్రి పరిసరాలను, పాత భవనాన్ని పరిశీలించారు. రోగులతో మాట్లాడి..వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఉస్మానియా ఆసుపత్రి వైద్యులను గవర్నర్ తమిళిసై అభినందించారు. సౌకర్యాలు లేకున్నా  వైద్య సేవలో ఎలాంటి తేడా లేదన్నారు. వైద్యసేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చాలి చాలని స్థలంలోనే వైద్యులు  రోగులకు చికిత్స అందిస్తున్నారని కొనియాడారు. ఒకే వార్డులో రెండు మూడు అంత కంటే ఎక్కువ విభాగాలను అడ్జెస్ట్ చేశారని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం కట్టి వందల ఏళ్లవుతోందని..ఇప్పటికైనా ప్రభుత్వం నూతన బిల్డింగ్ను నిర్మించాలన్నారు. 

ALSO READ:తృటిలో తప్పిన ప్రమాదం.. విరిగిన చక్రంతో 10 కి.మీ. ప్రయాణించిన రైలు


ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ గవర్నర్‌ తమిళిసై ఇటీవలే  ట్విటర్‌లో పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలంటూ ‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ చేసిన ట్వీట్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రీట్వీట్‌ చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని..అయితే ప్రస్తుతం ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోందని చెప్పారు. గవర్నర్ వ్యాఖ్యలపై  మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. గవర్నర్ కు అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.  గవర్నర్ తీరు కోడి గుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఉందని మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధిలా  గవర్నర్ మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుందని మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.