గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు.. మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేశారు. గౌలిదొడ్డిలోని కేశవ్‌నగర్‌కు చెందిన సాంబయ్య.. కాశమ్మ(36)ను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొదటి భార్య బిడ్డ కూడా వీళ్లతోనే ఉంటోంది. కాశమ్మ స్థానికంగా వేస్ట్ మెటీరియల్ సేకరించి, వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే కొన్ని రోజులుగా మద్యానికి అలవాటుపడి, డబ్బులన్నీ ఖర్చు చేస్తోంది. తాను కూలీకి వెళ్లి సంపాదించిన డబ్బులు కూడా ఉంచడం లేదని.. కాశమ్మతో బిడ్డ గొడవ పడింది.
దీంతో కాశమ్మ శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. రెండ్రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతోఈ నెల 27న గచ్చిబౌలి పోలీసులకు బిడ్డ కంప్లయింట్ చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 9 గంటలకు విప్రో సర్కిల్ దగ్గర్లో ఓ కన్స్ర్టక్షన్ సంస్థ నిర్మిస్తున్న బిల్డింగ్ లోని సెల్లార్ లో మహిళ మర్డర్ కు గురైందని సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఆ మహిళను కాశమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వేస్ట్ మెటీరియల్ వెతుక్కుంటూ బిల్డింగ్‌లోకి వెళ్లిన కాశమ్మను గుర్తు తెలియని వ్యక్తులు రేప్ చేసి, ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
రెండ్రోజుల కిందే తెలిసినా..
బిల్డింగ్ సెల్లార్లో రెండ్రోజుల కిందనే కాశమ్మ డెడ్‌బాడీని గుర్తించారని, అయితే అది బయటకు చెప్పవద్దని కూలీలపై నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. కేసు తమపైకి రాకుండా డెడ్‌బాడీని మాయం చేసేందుకు వాళ్లు ప్రయత్నించినట్టు స్థానికులు అంటున్నారు. నిర్మాణ సంస్థలో పని చేస్తున్న కార్మికులే కాశమ్మను రేప్‌చేసి, చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి.. నిర్మాణ సంస్థతో మాట్లాడి బాధిత మహిళ కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారం ఇప్పించారు.
48 గంటల్లో రిపోర్ట్ ఇవ్వండి: గవర్నర్
నానక్ రామ్ గూడలో మహిళను రేప్ చేసి, హత్య చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి రావటంతో గవర్నర్ స్పందించారు. మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, సైబరాబాద్ సీపీని గవర్నర్తమిళిసై ఆదేశించారు.