- పోషకాహార లోపంతో అంతరించిపోతున్న ఆదిమజాతి
- రెండు పెంటలను దత్తత తీసుకున్న గవర్నర్
- సహకరించనున్న ప్రభుత్వ శాఖలు, రెడ్‌క్రాస్
నాగర్‌కర్నూల్, వెలుగు : నల్లమలలోని చెంచుల పరిరక్షణకు రాజ్‌భవన్ ముందుకొచ్చింది. వీరి జీవన విధానం, పౌష్టికాహార లోపంతో 40 ఏండ్లకే వృద్ధాప్యం వస్తుండడం, 50 ఏండ్లకే కన్నుమూస్తుండడంతో వారిని బతికించుకునేందుకు ప్రభుత్వంలోని వివిధ శాఖలు, రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి పని చేసేందుకు రెడీ అయ్యింది. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమలలోని రెండు చెంచుపెంటలు, ఆదిలాబాద్, భద్రాచలం కొత్తగూడెం జిల్లాల్లో గోండ్లు, కోయ రెడ్లు ఉండే పెంటలను కూడా గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. మూడేండ్లలో చెంచులు, గోండ్లు, కోయరెడ్ల జీవన విధానం మార్చాలని చూస్తున్నారు.
పోషకారహార లోపమే కారణం
చెంచుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యలు, ఉపాధి, ఆదాయ మార్గాలు, మహిళ – శిశు ఆరోగ్యం, సంరక్షణ ఇలా అనేక అంశాలపై నేషనల్ఇన్స్టిట్యూట్ఆఫ్ న్యూట్రిషన్ సంస్థతో రీసెర్చ్ చేయించారు. చివరకు చెంచుల అనేక సమస్యలకు సరైన పోషకాహారం అందకపోవడమే కారణమని గుర్తించారు. ఇందులో భాగంగా నల్లమల చెంచుల రక్షణ కోసం పైలట్‌ప్రాజెక్టు కింద అప్పాపూర్ , భౌరాపూర్ చెంచు పెంటలను ఎంపిక చేసి గవర్నర్దత్తత తీసుకున్నారు. రెడ్ క్రాస్ సహకారంతో.. ప్రభుత్వ శాఖల చొరవతో చెంచుపెంటల్లో వారి అవసరాలకు తగ్గట్లు కొన్ని పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన చెంచు పెంటల్లో వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా రాజశ్రీ కోళ్లు, హార్టికల్చర్ ద్వారా పండ్ల తోటల పెంపకం చేపట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు పెంటల్లో ఒక్కో ఫ్యామిలీకి 10 రాజశ్రీ కోళ్లను ఇచ్చారు. వీటి పెంపకంపై అవగాహన కల్పించిన వెటర్నరీ ఆఫీసర్లు దాణా, మందులను అందజేశారు. కోళ్లు పెంచుతూ వాటి ద్వారా రెగ్యులర్ గా వచ్చే గుడ్లను వారికే అందజేస్తూ పోషక విలువలు పెంచాలన్నది వీరి లక్ష్యం. అలాగే చెంచుల గుడిసెల ముందు ఖాళీ ప్రదేశాల్లో పండ్ల మొక్కలు పెంచేందుకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు బాధ్యత అప్పగించారని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తెలిపారు. రెడ్‌క్రాస్ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తుందని, గవర్నర్ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారులు సమగ్రమైన ప్లాన్‌తో పని చేస్తారన్నారు. ఇక్కడ సక్సెస్అయితే అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 10 పెంటల్లో అమలు చేయనున్నారు.
బక్కచిక్కి..అంతమవుతున్న చెంచులు
ఒకప్పుడు బలంగా ఉండే చెంచులు ఇప్పుడు బక్కచిక్కిపోయారు. ఆహారపు అలవాట్లలో మార్పులు, పోషక విలువల లోపంతో సన్నగా మారిపోతున్నారు. దశాబ్దాల కింద చెంచులకు జంతువుల వేట ప్రధాన జీవనాధారంగా ఉండేది. అటవీ వన్యప్రాణి సంరక్షణ చట్టాలతో వేట నిషేధించారు. దీంతో అడవుల్లో దొరికే పండ్లు, చాలీ చాలని రేషన్ సరుకులతో కుటుంబమంతా వెళ్లదీయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఐరన్, క్యాల్షియం లోపం, రక్తహీనత, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి తోడు సీజన్ వ్యాధులు, విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ప్రాణాలు తీస్తున్నాయి. అడవి జంతువుల దాడులు, పాము కాట్లతోనూ చనిపోతున్నారు. ఈ మధ్య మద్యానికి బానిస కావడంతో మరింత బలహీనంగా మారిపోతున్నారు. అడవి తగ్గిపోయి, ఉపాధి కూడా లేక అనేక చెంచు పెంటలు అంతరించిపోయాయి. జనాభా తగ్గిపోవడంతో మిగిలిన కుటుంబాలు ఇతర పెంటలకు వలస వెళ్లి స్థిరపడ్డాయి. జిల్లాలోని పందిబొర్రె నుంచి మేడి మాకులకు, వేములపాయవాగు నుంచి ఈర్లపెంటకు, లింగబేరి నుంచి సంగిడి గుండాలకు, దోరాలపెంట నుంచి పుల్లయ్యపల్లికి పలు కుటుంబాలు వలస వెళ్లాయి. దీంతో పందిబొర్రె , వేములపాయవాగు, లింగబేరి, దోరాలపెంటలు మాయమయ్యాయి.