- ట్రైబల్స్, ఆదివాసీలతో సమావేశంలో గవర్నర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ట్రైబల్, ఆదివాసీ ప్రాంతాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, తన పరిధి మేరకు సమస్యలు పరిష్కరిస్తున్నానని గవర్నర్ తమిళిసై అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని, న్యూట్రిషన్ ఫుడ్ అందించడం, రెడ్ క్రాస్ ద్వారా మెడికల్ క్యాంపులు నిర్వహించేలా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. శుక్రవారం రాజ్ భవన్లో ఆదివాసీ, గిరిజనులతో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ హర్ష చౌహాన్, మెంబర్ అనంత్ నాయక్, గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రాచలం డెవలప్మెంట్ ఫోరం సమన్వయకర్త విఠల్ ఆధ్వర్యంలో కోయ, గుత్తి కోయలతో పాటు ప్రొఫెసర్లు, లా గ్రాడ్యుయేట్లు తమ సమస్యలను గవర్నర్కు వివరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ భద్రాచలంలో 200 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాల్సిన అవసరం ఉందని,
దీంతో ఏపీ, తెలంగాణ, చత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో పర్యటించానని, నల్లమల్ల ఫారెస్ట్ ప్రాంతాల్లో నివసిస్తున్న పబ్లిక్కు న్యూట్రిషన్ ఫుడ్ అందించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధికారుల సహకారం తీసుకున్నానని చెప్పారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ హర్ష చౌహాన్ మాట్లాడుతూ, ట్రైబల్, ఆదివాసీ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రాలు కమిషన్కు కూడా పంపాలని ట్రైబల్ ప్రతినిధులను కోరారు. ట్రైబల్ సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాగా, ట్రైబల్, ఆదివాసీల కోసం ఎన్నో చట్టాలు ఉన్నా అవి అమలు కావడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేత చింపరయ్య అన్నారు.
సీఎస్తో ఎస్సీ కమిషన్ చైర్మన్ సమావేశం
సీఎస్ శాంతి కుమారి, ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నతాధికారులతో నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్, మెంబర్, సెక్రటరీ శుక్రవారం ఎంసీహెచ్ ఆర్డీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలు, రోడ్లు, కరెంట్ సమస్యలు వంటి అంశాలపై సీఎస్ నుంచి వివరాలు
తెలుసుకున్నారు.