సామాన్యుల కోసం ప్రజా పాలన వచ్చింది : గవర్నర్

తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించామన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. ఫిబ్రవరి 8వ తేదీ గురువారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీకి హాజరై గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ నారాయణ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సామాన్య ప్రజల కోసం ప్రజాభవన్ ను తెరిచామని చెప్పారు.  ఆరు గార్యంటీలల్లో  రెండింటిని అమలు చేశామని.. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేయనున్నట్లు తెలిపారు.  అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ను ఇస్తామన్నారు. 

గత ప్రభత్వం రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి.. మాకు అప్పగించారని..ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని చెప్పారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని.. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.  కాలానుగుణంగా హామీలను అమలు చేస్తామని.. ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో 1.8 కోట్ల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.