- రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య గ్యాప్‌కు కారణం తెలియదు
- నాకు ఎలాంటి ఇగో లేదు.. నన్ను సిస్టర్లా చూడండి
- యాదాద్రి ప్రారంభోత్సవానికి వెళ్లాలని ఉన్నా.. నాకు ఆహ్వానం అందలేదు
- ఉగాది వేడుకలకు నేను ఆహ్వానం పంపినా కొందరు రాలేదు..
- వాళ్ల గురించి చెప్పేదేమీ లేదు
- ప్రగతిభవన్‌లో ఉగాది వేడుకలకు పిలిస్తే ప్రొటోకాల్ పక్కనపెట్టి వెళ్తుంటినని వ్యాఖ్య
- రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు కేసీఆర్, మంత్రులు గైర్హాజరు
హైదరాబాద్, వెలుగు: తాను చాలా స్ట్రాంగ్ అని, తన తలను ఎవరూ వంచలేరని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి వెళ్లాలని ఉన్నప్పటికీ తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు గ్యాప్ రావడానికి కారణం తెలియదన్నారు. ‘‘నేను వివాదాస్పదం చేసే వ్యక్తిని కాదు. గ్యాప్ సృష్టించే వ్యక్తిని కూడా కాదు” అని తెలిపారు. వచ్చే నెల నుంచి రాజ్ భవన్ లో ప్రజా దర్బార్‌ను ప్రారంభిస్తున్నామని గవర్నర్ ప్రకటించారు. ప్రజల నుంచి వారి సమస్యలు స్వీకరిస్తానన్నారు. శుక్రవారం రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు జరిగాయి. సీఎం కేసీఆర్‌సహా రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పంపినప్పటికీ ఎవరూ హాజరుకాలేదు. పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా పెద్దగా కనిపించలేదు. వేడుకల్లో గవర్నర్ మాట్లాడుతూ.. ‘‘ఉగాది వేడుకలు తెలంగాణలో నవశకం. మనం అంతా ఒక దగ్గర కూర్చొని తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలి. నాది స్నేహ పూర్వక వైఖరి. ప్రజల కోసమే నేను ఇక్కడ ఉన్నా” అని చెప్పారు.
అందరినీ ఆహ్వానించాం
రాష్ట్రంలో అత్యున్నత వ్యక్తుల నుంచి సామాన్యుల వరకు అందరినీ రాజ్‌భవన్‌లోని ఉగాది వేడుకలకు రావాలని ఆహ్వానించామని గవర్నర్ తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినవారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇంకొందరు రాలేదని, అట్లని తాను బాధపడటం లేదన్నారు. ‘‘ఉగాది వేడుకలకు హాజరు కావాలని టాప్ మోస్ట్ వ్యక్తుల నుంచి సాధారణ పబ్లిక్ వరకు అందరికీ ఇన్విటేషన్ పంపాం. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలను పిలిచాం. 119 మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించాం.. కొందరు వచ్చారు.. రాని వారి గురించి నేను చెప్పేది ఏమీ లేదు” అని ఆమె పేర్కొన్నారు.
కరోనా కారణంగా మొన్నటివరకు అందరం దూరంగా ఉన్నామని, రెండున్నరేండ్ల తర్వాత కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ‘‘నన్ను ప్రగతి భవన్లో ఉగాది వేడుకలకు ఆహ్వానించి ఉంటే ప్రొటోకాల్ ను పక్కనపెట్టి అటెండ్ అయ్యేదానిని. యాదాద్రి కి నన్ను ఆహ్వానించలేదు... కానీ నాకు వెళ్లాలని ఉండే” అని అన్నారు. కొన్ని అంశాలపై డిఫరెన్సెస్ ఉన్నాయని, తాను ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదని, ఇగ్నోర్ చేశారని తెలిపారు. ‘‘సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లాను.. ఎవరో పిలుస్తరని, ఎవరో స్వాగతం పలుకుతారని నేను ఎదురుచూడను. ఎవరైనా సిస్టమ్‌ను ఫాలో అయితే చాలు’’ అని అన్నారు. తాను ప్రతిపాదన చేసిన వెంటనే పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్స్ రన్ చేస్తున్నందుకు ప్రధాని మోడీకి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. రాజ్‌భవన్ ఉగాది వేడుకలకు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహిత మొగిలయ్య, పలువురు వీసీలు, పుదుచ్చేరి మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పలువురు మహిళలకు , క్యాన్సర్ పేషెంట్లకు, దివ్యాంగులకు ఆర్థిక సాయం అందజేశారు.
రాజ్‌భవన్ లిమిట్స్ నాకు తెలుసు
రాజ్‌భవన్‌లోని గ్రీవెన్స్ బాక్స్ కు మంచి స్పందన వస్తున్నదని, నిత్యం వస్తున్న సలహాలు, సూచనలను పరిశీలిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. సమస్యలను వివిధ ప్రభుత్వ శాఖలకు పంపిస్తున్నానని, రాజ్ భవన్ పరిమితులు తనకు తెలుసన్నారు. ప్రజా దర్బార్ ద్వారా మరింతగా ప్రజల్ని కలిసే అవకాశం ఉందని, వారికి తనవంతుగా సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ఇగో లేదని, ఫ్రెండ్లీ పర్సన్‌ని అని, తనను సోదరిలా చూడాలని గవర్నర్ తమిళిసై కోరారు.
రాజ్ భవన్లో ఫ్రెండ్లీ గవర్నర్ ఉన్నరు. నన్ను గవర్నర్ లా కాకుండా తెలంగాణ సోదరిగా భావించండి. నేను ఇగోయిస్టిక్ పర్సన్ ని కాదు. ఎనర్జటిక్ పర్సన్‌ని. అందరితో సఖ్యతగా ఉండటమే నాకు తెలుసు. ప్రజల మేలు కోసమే రాజ్ భవన్ ఉన్నది. రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పబ్లిక్కు తోచినంత సాయం చేసేందుకు నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం.
- గవర్నర్ తమిళిసై