కర్నాటక రాష్ట్రాన్ని భూ కుంభకోణం ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య ఫ్యామిలీపై విచారణకు గవర్నర్ చంద్ గెహ్లాట్ విచారణకు ఆదేశించటం కలకలం రేపుతోంది. అంతేనా.. సీఎం సిద్ధరామయ్యపై ఏకంగా ప్రైవేట్ క్రిమినల్ కేసు నమోదు కావటం ఇప్పుడు ఈ కేసులో బిగ్ డెవలప్ మెంట్. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..
భూ కుంభకోణం కేసు ఏంటీ.. :
సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూర్ ఏరియాలో మూడు ఎకరాల భూమి ఉంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 2021లో.. కేసర్ గ్రామంలోని సిద్ధరామయ్య భార్య పార్వతి పేరుతో ఉన్న మూడు ఎకరాల భూమిని మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్వాధీనం చేసుకున్నది. ఈ 3 ఎకరాలను ప్రభుత్వం తీసుకోవటంతో.. అందుకు పరిహారంగా.. దక్షిణ మైసూర్ లోని విజయ్ నగర్ ఏరియాలో కొన్ని ప్లాట్లు కేటాయించింది మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ. ఇక్కడే బిగ్ ట్విస్ట్.. సిద్ధరామయ్య తన ఎన్నికల అఫిడవిట్ లో ఈ మూడు ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడించలేదని.. తన భార్య పేరుతో కూడా ఈ భూమి ఉన్నట్లు స్పష్టం చేయలంటూ.. అబ్రహం అనే వ్యక్తి కేసు పెట్టారు. అంతే కాకుండా సర్కార్ కు ఇచ్చిన భూమి.. వారికి కేటాయించిన ప్లాట్ల మధ్య వ్యత్యాసం చాలా ఉందని.. ఇది అధికార దుర్వినియోగం అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు అబ్రహం.
ఈ అంశం కర్నాటకలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీఎం సిద్ధరామయ్య అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నాడంటూ ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలోనే ఈ అంశంపై విచారణ చేయాలంటూ గవర్నర్ చందు గెహ్లాట్ ఆదేశించారు. సీఎంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. సిద్ధరామయ్యను ఏ క్షణమైనా విచారించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి చెందిన భూమిని.. సిద్ధరామయ్య కుటుంబం నకిలీ పత్రాలతో సొంత ఆస్తిగా చూపించి.. ఆ భూమిని మళ్లీ అథారిటీకే అప్పగించి.. అందుకు ప్రతిఫలంగా ప్లాట్లు పొందిందని.. ఇందులో అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాలు జరిగాయంటూ స్నేహమయి కృష్ణ అనే సామాజిక కార్యకర్త.. ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్ క్రిమినల్ కంప్లయింట్ ఫైల్ చేసింది.