
గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం, పని విధానంలో కీలక పాత్రను పోషిస్తుంది. కేంద్రంలో అనుసరించే పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవేశ పెట్టడం వల్ల కేంద్రంలో రాష్ట్రపతి పోషించే పాత్రను రాష్ట్రాల్లో గవర్నర్లు పోషిస్తారు. రాజ్యాంగంలోని 153వ అధికరణ ప్రకారం ప్రతి రాష్ట్రానికి అధిపతిగా ఒక గవర్నర్ ఉంటారని పేర్కొంటుంది.
ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన కార్యనిర్వహణాధికారాలు మొత్తం గవర్నర్ ద్వారా, గవర్నర్ పేరు మీద నిర్వహించబడుతాయి. గవర్నర్ రాష్ట్ర పరిపాలనను స్వయంగా గానీ, ఆయన నియమించిన అధికారుల సహకారంతో గానీ కొనసాగించవచ్చు. రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదించిన తర్వాత మాత్రమే అవి చట్టాలుగా మారుతాయి.
అందువల్ల గవర్నర్ రాష్ట్ర శాసనశాఖలో భాగంగా పరిగణిస్తారు. ఏకవిధ సభ అయితే విధాన సభలో ద్వివిధ సభ అయితే రెండు సభల్లో ఆమోదించిన ప్రతి సాధారణ బిల్లు గవర్నర్కు పంపిస్తారు. ఆ సందర్భంలో గవర్నర్కు నాలుగు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
- గవర్నర్ బిల్లును ఆమోదించవచ్చు. అప్పుడు బిల్లు చట్టం అవుతుంది.
- బిల్లును గవర్నర్ ఆమోదించకపోవచ్చు. దానితో బిల్లు అంతమవుతుంది. ఆ బిల్లు చట్టం రూపం దాల్చదు.
- గవర్నర్ బిల్లును సభకు తిప్పి పంపవచ్చు. ఒకవేళ ఆ బిల్లును సవరణలతో సభ మళ్లీ ఆమోదిస్తే గవర్నర్ ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి. ఈ విధంగా గవర్నర్కు సస్పెన్సివ్ వీటో మాత్రమే ఉన్నది.
- ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ రిజర్వు చేయవచ్చు.
- రాష్ట్రపతి పరిశీలనకు బిల్లును పంపిన తర్వాత, గవర్నర్కు ఆ బిల్లును శాసనం చేయడంలో ఎలాంటి పాత్ర ఉండదు. ఒకవేళ బిల్లును రాష్ట్రపతి సభ పున: పరిశీలనకు పంపవచ్చు. ఆ బిల్లును సభ ఆమోదించి మళ్లీ రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి ఆమోదిస్తే ఆ బిల్లు చట్టం అవుతుంది. అంటే గవర్నర్ ఆమోదం ఏ మాత్రం అవసరం లేదు.
ద్రవ్య బిల్లుల విషయంలో
- రాష్ట్ర శాసనసభ ద్రవ్య బిల్లును ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. ఆ సందర్భంలో గవర్నర్కు మూడు ప్రత్యామ్నాయాలు ఉంటాయి.
- ఆ బిల్లును గవర్నర్ ఆమోదించవచ్చు. అప్పుడు అది చట్టం అవుతుంది.
- ఆ బిల్లును గవర్నర్ నిలిపివేయవచ్చు. అప్పుడు ఆ బిల్లు చట్ట రూపం దాల్చదు.
- గవర్నర్ బిల్లును రాష్ట్రపతి పున: పరిశీలనకు పంపవచ్చు.
- అయితే, గవర్నర్ ద్రవ్య బిల్లును రాష్ట్ర శాసనసభ పున: పరిశీలనకు పంపలేడు. గవర్నర్ ముందస్తు అనుమతితోనే రాష్ట్ర శాసనసభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెడతారు. కాబట్టి సాధారణంగా గవర్నర్ ద్రవ్య బిల్లును ఆమోదిస్తారు.
రాష్ట్ర శాసనాలపై రాష్ట్రపతి వీటో అధికారం
రాష్ట్ర బిల్లులకు సంబంధించిన విషయాల్లో రాష్ట్రపతికి వీటో అధికారం ఉంటుంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారాలంటే తప్పనిసరిగా ఆ బిల్లులు గవర్నర్ లేదా రాష్ట్రపతి (ఒకవేళ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు) ఆమోదముద్ర పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వు చేసినప్పుడు రాష్ట్రపతికి మూడు మార్గాలు ఉంటాయి.
బిల్లును ఆమోదించవచ్చు లేదా ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించవచ్చు. లేదా రాష్ట్ర శాసనసభకు పున: పరిశీలన కోసం తిరిగి పంపమని గవర్నర్ కోరవచ్చు. అలా పంపించిన బిల్లును రాష్ట్ర శాసనసభ సవరణలతో/ సవరణలు లేకుండా ఆమోదించి తిరిగి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా అలాంటి బిల్లును రాష్ట్రపతి ఎంతకాలం తన దగ్గర అట్టిపెట్టుకోవాలనే విషయమై నిర్దిష్ట సమయాన్ని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. అంటే, ఈ బిల్లుల విషయంలో రాష్ట్రపతి పాకెట్ వీటోను వినియోగించుకునే అవకాశం ఉన్నది.