గుడ్ న్యూస్: అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5% ఐఆర్

గుడ్ న్యూస్: అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5%  ఐఆర్
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆర్థిక  శాఖ

హైదరాబాద్​, వెలుగు : అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్​(ఇంటీరిమ్​ రిలీఫ్​) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. బేసిక్​ పే పై 5% ఐఆర్ మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ  చేసింది. దాదాపు ఏడాది నుంచి ఐఆర్​ కోసం  ప్రభుత్వ రంగ సంస్థలు,  సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విధంగానే తమకూ  ఐఆర్ అమలు అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎంకు విన్నవించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. ఐఆర్ విడుదల చేయడం పట్ల ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు బాలకృష్ణ,  ప్రధాన కార్యదర్శి జీవన్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఈ భృతి విడుదల చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.