- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- 60 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఎస్సీ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 60 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై అరవై రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేలా వన్ మ్యాన్ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణపై ఈ ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, అదే రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్మాట్లాడుతూ.. కోర్టు తీర్పును రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం, ఎంపీ మల్లు రవితో కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటి వరకు నాలుగు సార్లు సమావేశమై.. వర్గీకరణపై చర్చించింది. మరో వైపు వర్గీకరణ అమలుపై సలహాలు, సూచనలు ఇవ్వాలని దళిత సంఘాలు, నేతలను ప్రభుత్వం కోరడంతో గత నెల 30 నుంచి ఎస్సీ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందజేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1,500 వినతిపత్రాలు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జస్టిస్ షమీమ్ అక్తర్.. 2017 జనవరి 17న తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2022 డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు.