
న్యూఢిల్లీ: పాడి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో పాల ఉత్పత్తిని, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద రూ.3,400 కోట్ల నిధులను కేటాయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం (మార్చి 19) జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా మరి కొన్ని నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పాడి పరిశ్రమ, ఎరువుల పరిశ్రమలను బలోపేతం చేయడంతో పాటు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి రూ.16,000 కోట్లకు పైగా పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద రూ.3,400 కోట్ల నిధులు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. అలాగే.. అస్సాంలోని నమ్రూప్‌లో రూ. 10,601 కోట్ల పెట్టుబడితో కొత్త బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా-యూరియా కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (BVFCL) నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్ ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
Also Read :- రేషన్ కార్డు పాపులారిటీ కార్డ్గా మారింది
ఎరువుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి ఈశాన్య ప్రాంతంలోని రైతులకు సకాలంలో ఎరువులు అందేందుకు ఇది ఉపయోగపడుతోందన్నారు. JNPA పోర్ట్ (పగోట్)ను మహారాష్ట్రలోని చౌక్‌తో అనుసంధానించడానికి రూ.4,500 కోట్ల పెట్టుబడితో 6 లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హై-స్పీడ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని పేర్కొన్నారు. ఈ హైవే JNPA పోర్ట్, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే, ఎన్‌హెచ్ -66 (ముంబై-గోవా హైవే) మధ్య కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రోత్సాహక పథకాన్ని (P2M) మంత్రివర్గం పొడిగించింది. రూ. 1,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకం డిజిటల్ చెల్లింపులను మరింత బలోపేతం చేయనుంది.