- టమాటాలపై సబ్సిడీ మరింత పెంచిన కేంద్రం
- ఢిల్లీ-ఎన్సీఆర్లో మొబైల్ వ్యాన్ల ద్వారా అమ్మకాలు
న్యూఢిల్లీ: చుక్కలను అంటుతున్న టమాటాల ధరను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో ఇప్పటికే సబ్సిడీపై టమాట అమ్మకాలు జరుపుతున్న కేంద్రం.. తాజాగా ఈ సబ్సిడీ మొత్తాన్ని మరో పది రూపాయలు పెంచింది. దీంతో ఆదివారం నుంచి కిలో టమాటా రూ.80 లకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరఫున నేషనల్ కేపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలో నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ (ఎన్ సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (ఎన్ఏఎఫ్ఈడీ) మొబైల్ వ్యాన్ల ద్వారా అమ్మకాలు జరుపుతున్నాయి.
ALSO READ :పురుగులన్నం పెడ్తున్నారని గురుకులం ముందు ఆందోళన
దీంతోపాటు కేంద్రీయ భండార్ రిటైల్ ఔట్ లెట్లలో టమాటాలను సబ్సిడీపై అమ్ముతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం నుంచి కిలో రూ.90 చొప్పున రెండు రోజుల వ్యవధిలో సబ్సిడీపై 42 టన్నుల టమాటాలను అమ్మినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఢిల్లీ–ఎన్సీఆర్ రీజియన్ తో పాటు వారణాసి, లక్నో, కాన్పూర్, పాట్నా, ముజఫర్ పూర్ సిటీలలో టమాటలను సబ్సిడీపై అమ్ముతున్నట్లు వెల్లడించిన కేంద్రం.. త్వరలో కొరత ఉన్న రాష్ట్రాలలో అమ్మకాలు చేపట్టనున్నట్లు ఎన్సీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ లు ఓ ప్రకటనలో వెల్లడించాయి. కాగా, సబ్సిడీ అమ్మకాలతో టమాటాల ధర దిగొస్తుందని ఎన్ సీసీఎఫ్ఎండీ అనీస్ జోసెఫ్ చంద్ర పేర్కొన్నారు. హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ.130 చొప్పున అమ్ముడవుతున్న టమాటాల ధర సబ్సిడీ అమ్మకాలతో రూ.115 కు తగ్గిందని ఆయన వివరించారు.