వంద పడకల హాస్పిటల్ కు డాక్టర్లు, స్టాఫ్​ ఎందుకు లేరు? : పొద్దుటూరి వినయ్​ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ హాస్పిటల్ ను వంద పడకల హాస్పిటల్​గా మార్చానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గొప్పలు చెబుతున్నా, అందుకు తగ్గట్లు డాక్టర్లు, స్టాఫ్​ని నియమించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆర్మూర్​నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి వినయ్​ రెడ్డి మండిపడ్డారు. బుధవారం కాంగ్రెస్​లీడర్లు హాస్పిటల్​ను సందర్శించి సూపరింటెండెంట్​ నాగరాజు, స్టాఫ్, రోగులతో మాట్లాడారు. 

వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. వంద ‌‌‌‌‌‌‌‌పడకల హాస్పిటల్ లో 45 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 15 మంది ఉన్నారని, వీరిలో 12 మంది వేరే ఆసుపత్రుల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన వారేనన్నారు. హాస్పిటల్​లో 60 మంది నర్సుల అవసరం ఉండగా 20 మందే ఉన్నారన్నారు. స్కానింగ్ మిషన్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, థియేటర్ అసిస్టెంట్లు అందుబాటులో లేరన్నారు. కనీసం రోగులను తీసుకెళ్లడానికి వీల్ చైర్లు లేకపోవడం సిగ్గుచేటన్నారు. 

డెలివరీ కేసులు తప్ప, ఇక్కడ ఎలాంటి సేవలు అందించడం లేదన్నారు. ఎమర్జెన్సీ అయితే నిజామాబాద్ పంపిస్తున్నారని చెప్పారు. ఇంతకు హాస్పిటల్​అప్ గ్రేడ్ అయినట్లా, కానట్లా అని ప్రశ్నించారు. 24 గంటలు సీఎం వెంట ఉండే జీవన్ రెడ్డి, ఆర్మూర్ హస్పిటల్​లో సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేశ్, టౌన్, మండల కాంగ్రెస్ ​ప్రెసిడెంట్లు సాయిబాబా గౌడ్, చిన్నారెడ్డి, మాజీద్, జిమ్మి రవి, మందుల పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.