నెలకు 13 వేల రూపాయల జీతంతో ఎవరైనా తన గర్ల్ ఫ్రెండ్ కు ఏం కొనగల్గుతారు.. ఓ రోజ్ ఫ్లవర్ కూడా కొనడానికి మిగలవు ఇప్పుడున్న పరిస్థితులలో. కానీ ఒక లవర్ ఏకంగా గర్ల్ఫ్రెండ్కు BMW కారు.. 4BHK ఫ్లాట్ కొనిచ్చాడు. అంతేకాదు రూపాయి, రెండు రూపాయలను బిగబట్టి ఖర్చుచేసే వ్యక్తి ఏకంగా లెక్జరీ కార్లతో తిరగడం, మెయింటెనెన్స్ చూసీ అందరూ షాకయ్యారు. అందుకోసం మనోడు పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. అదికూడా చాలా తెలివిగా.. టెక్నాలజీని ఎలా వాడాలో అలా వాడుకొని కోట్లు కొల్లగొట్టాడు.
ఇంత పెద్ద ఎమౌంట్ చాలా తెలివిగా లాగేసిన వ్యక్తి మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి హర్ష్‌కుమార్ క్షీరసాగర్. ఇద్దరు సహచరులతో కలిసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రాంతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ నుండి 21.59 కోట్ల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేశాడు. ప్రభుత్వ క్రీడా కార్యక్రమాలకు కేటాయించిన నిధులు విపరీతంగా కొనుగోళ్లకు ఖర్చవుతుండటం చూసీ షాకయ్యారు అధికారులు.
ALSO READ | ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు
అన్ని కోట్ల డబ్బులతో BMW కారు, బైక్‌ని కొనుగోలు చేయడంతోపాటు విమానాశ్రయానికి సమీపంలో గర్ల్ ఫ్రెండ్ కు ఖరీదైన అపార్ట్ మెంట్ లో 4BHK ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అంతేకాకుండా డైమండ్ నెక్లెస్, జ్యువెలరీ.. ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేసి చివరికి రూ. 35 లక్షల విలువైన ఎస్‌యూవీ తీసుకొని ఫ్రెండ్స్ తో ఉడాయించాడు.
ప్రభుత్వ ఆఫీసు నుంచి అకౌంట్లో ఉన్న డబ్బు అలా ఎలా మాయం చేశాడని అందరికీ అనుమానం వచ్చింది. ఇందుకోసం మనోడు ఏం చేశాడంటే.. ఇండియన్ బ్యాంక్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేశాడు. ఆ డబ్బులు తీయాలంటే డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం చేసిన చెక్కులు అవసరం. అందుకోసం అతని సహచరులు -యశోదా శెట్టి, ఆమె భర్త BK జీవన్ సహాయంతో -ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ కోసం నకిలీ పత్రాలను రూపొందించారు. యాక్సెస్ తీసుకున్న తర్వాత తమ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసుకున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా కోట్ల డబ్బు కాజేసీ జల్సాలకు పాల్పడ్డారు.
కాంప్లెక్స్ పనుల కోసం అవసరమైన డబ్బుల కోసం చూడగా అకౌంట్లో కోట్ల డబ్బు మాయం అయినట్లు డిప్యూటీ డైరెక్టర్ గుర్తించాడు. ఆరు నెలలుగా అకౌంట్ నుండి డబ్బులు విత్ డ్రా అవుతున్న సంగతి తెలిసి ఖంగు తిన్నారు. ఇది ఎవరి పని అని విచారించే లోపే క్షీరసాగర్ ఎస్‌యూవీతో పరారయ్యాడు.