
ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోకుండా కుట్ర చేస్తున్నారని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పటాన్ చెరు ఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళనకు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను.. వికారాబాద్ జిల్లాలో ఎన్నికల బాధ్యతలు అప్పగించడంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనీయకుండా పటాన్ చెరు ఆర్ఓ ఇబ్బందులకు గురి చేశారని వారు ఆరోపించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకునేందుకు మంగళవారం చివరి రోజు కావడంతో పలువురు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటాన్ చెరు కార్యాలయానికి చేరుకున్నారు. గత మూడు రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పటాన్ చెరు ఆర్ఓ స్పందించడం లేదని ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
తమకు ఓటు హక్కు వినియోగించుకునే హక్కు రాజ్యాంగం కల్పిస్తే ఇక్కడ అధికారులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని ఎన్నికల డ్యూటీని మేం బహిష్కరిస్తామని కార్యాలయం ముందు బైఠాయించారు.
పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఎట్టకేలకు ఆర్ ఓ స్పందించి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని, ఓటరు కార్డు జిరాక్స్ తెచ్చి ఇవ్వాలని చెప్పడంతో ఎన్నికల కార్యాలయంలో జిరాక్స్ మిషన్ కూడా లేదా బయటకు ఎక్కడకు వెళ్లి తెచ్చుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు.