ఈ నెలలోనే మరో 3 నోటిఫికేషన్లు!

ఈ నెలలోనే మరో 3 నోటిఫికేషన్లు!

హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే గ్రూప్​1 నోటిఫికేషన్​ఇచ్చిన తెలంగాణ పబ్లిక్​సర్వీస్​కమిషన్(టీఎస్​పీఎస్సీ) మరిన్ని కొత్త పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే ఫారెస్ట్, ట్రాన్స్​పోర్ట్, ఆరోగ్య శాఖలోని ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పలు పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ క్లియరెన్స్ కూడా రావడంతో ఈ నెలాఖరులో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 80 వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని మూడు నెలల కింద సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు పోలీసు, గ్రూప్​1 లాంటి కొన్ని పోస్టులకే నోటిఫికేషన్లు వచ్చాయి. దీంతో తదుపరి ఉద్యోగ ప్రకటనల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటికే ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇచ్చిన ట్రాన్స్​పోర్టు, ఫారెస్ట్, మెడికల్ తదితర డిపార్ట్​మెంట్లలోని పోస్టుల భర్తీపై టీఎస్​పీఎస్సీ దృష్టి సారించింది. ఆయా డిపార్ట్​మెంట్లతో రూల్స్, రోస్టర్​ తదితర అంశాలపై చర్చిస్తోంది. 

3 డిపార్ట్​మెంట్లు రెడీగానే... 

ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​లో మొత్తం1668 పోస్టులుండగా, వాటిలో అత్యధికంగా1393 బీట్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ట్రాన్స్​ పోర్టులో మొత్తం159 పోస్టులుండగా, వాటిలో113 పోస్టులు అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్​స్పెక్టర్​ఖాళీలు ఉన్నాయి. వైద్యారోగ్య శాఖలోనూ 2,662 పోస్టులున్నాయి. ఈ మూడు డిపార్ట్​మెంట్ల పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఫారెస్ట్ ఆఫీసర్లతో ఇప్పటికే మూడు దఫాలుగా మీటింగ్ నిర్వహించిన టీఎస్​పీఎస్సీ.. ఏఎంవీఐ పోస్టుల నియామకంలో కొన్ని రూల్స్​మార్చడంపై ఫోకస్​పెట్టింది. మెడికల్​విభాగంలోనూ స్టేట్ సబార్డినేట్ రూల్స్ మారుస్తున్నారు. కొద్దిరోజుల్లోనే వీటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

గ్రూప్ 4కు టైమ్​ పడ్తదా?

రాష్ట్రంలో 9,168 గ్రూప్1 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. అవన్నీ 74 శాఖలకు చెందిన పోస్టులు. ఆయా శాఖల నుంచి ఖాళీల వివరాలను ప్రభుత్వం ఇంకా సేకరించే పనిలోనే ఉంది. ఆ పోస్టులకు ఫైనాన్స్ శాఖ కూడా ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ప్రాసెస్ పూర్తయ్యేందుకు టైమ్​పట్టే అవకాశముంది. ఇప్పటికే టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్​రెడ్డితో కలిసి సీఎస్​సోమేశ్ కుమార్ ఆయా డిపార్టమెంట్లతో సమీక్ష నిర్వహించారు. మరోపక్క ఫైనాన్స్ అధికారులూ ఆయా విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తూ, పోస్టులను తేల్చేపనిలో ఉన్నారు. ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ఈ వారంలో ఆయా పోస్టులకు క్లియరెన్స్ ఇస్తే.. ఈనెలాఖరులో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. లేదంటే ఇక వచ్చేనెలలోనే ప్రకటన రావొచ్చు.