హైదరాబాద్: రూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు రుణ మాఫీ కాని రైతుల కోసం తాజాగా రూ.2,747.67 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. లబ్ధిదారులకు రుణమాఫీ ప్రాసెస్‌లో నెలకొన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించి రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు రుణమాఫీ కాని 3.14 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,747.67 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. ఎన్నికల్లో మాట ఇచ్చినట్లుగానే రెండు విడతల్లో రుణమాఫీ చేసింది. అయితే, సాంకేతిక కారణాలు, వివిధ కారణాల వల్ల కొందరు అర్హులకు రుణమాఫీ జరగలేదు. అర్హులైన 3.14 లక్షల మంది రైతులకు రుణమాఫీ నిధులు కాలేదు. దీంతో టెక్నికల్ సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం.. తాజాగా మిగిలిన రైతులకు పంట రుణమాఫీ నిధులు విడుదల చేసింది.