హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి అవసరాల కోసం గోదావరి రెండోదశ పనులకు ప్రభుత్వం గీన్ సిగ్నల్ ఇచ్చింది. 2030 నాటికి పరిస్థితిని అంచనా వేసి, మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని నగరానికి తరలించేందకు ఫేజ్–2 పని మొదలుపెట్టనుంది. ఇందుకోసం రూ.5,560 కోట్లు మంజూరుచేస్తూ మున్సిపల్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
గోదావరి రెండో దశ పనుల వల్ల నగరానికి తాగునీటితోపాటు మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలకు పునరుజ్జీవం లభిస్తుందని సర్కారు భావిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి కృష్ణా మూడు దశల్లోనూ..సింగూరు, మంజీరా, జంటజలాశయాలతోపాటు మొదటి దశ కింద గోదావరి జలాలను ఎల్లంపల్లి నుంచి తరలిస్తున్నారు. అయినా కోటి జనాభా దాటిన హైదరాబాద్నగర అవసరాలకు ప్రస్తుతం సరఫరా అవుతున్న నీళ్లు సరిపోవడం లేదు.
ఓఆర్ఆర్ విస్తరించడంతో ఆ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు సైతం మెట్రోవాటర్‌బోర్డు నీటిని అందిస్తున్నది. ప్రస్తుతం రోజుకు 580 నుంచి 600 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ ఫర్ డే) నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా వేసవిలో పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా నీటిని సరఫరా చేయడంలో అధికారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా 2030 వరకు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ హైదరాబాద్‌కు అదనపు నీటిని తరలించాలని అధికారులు భావిస్తున్నారు. మరో 170 ఎంజీడీల నీటిని హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీనికి ఇటీవలే మున్సిపల్‌శాఖ కార్యదర్శి దాన కిశోర్ ఆమోద ముద్రవేశారు. దీంతో 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి 15 టీఎంసీలను తరలించేందుకు అధి కారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
నీటి తరలింపు ఇలా..
గోదావరి ఫేజ్–2 ద్వారా హైదరాబాద్నగరానికి తాగునీటి అవసరాల కోసం10 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియలో భాగంగా అధికారులు ఘనపూర్‌లో 780 ఎంఎల్ డీ నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. అక్కడి నుంచి 2400 ఎంఎం డయా పైప్‌లైన్ ద్వారా 10 టీఎంసీల నీటిని నగరానికి తరలించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. గోదావరి ఫేజ్–1లో ఘనపూర్ నుంచి జలాలను ఇప్పటికే మూడు రింగ్ మెయిన్ పైప్లైన్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఒక రింగ్మెయిన్పైప్లైన్ ద్వారా బిట్స్ పిలానీ మీదుగా సైనిక్‌పురి వరకు జలాలను తరలిస్తున్నారు. రెండో రింగ్ మెయిన్ ద్వారా కుత్బుల్లాపూర్, కూకట్పల్లి మీదుగా లింగంపల్లికి, మూడో రింగ్‌మెయిన్ నుంచి ఔటర్ వెంట పటాన్చెరు, కోకాపేట ప్రాంతానికి నీటిని తరలిస్తున్నారు.
ఫేజ్–2లో ఘనపూర్నుంచి నాలుగో రింగ్ మెయిన్ పైప్‌లైన్ ను 40 కిలో మీటర్ల మేర ముత్తంగి వరకు నిర్మించనున్నారు. దీనిని ఇప్పటికే ఉన్న రింగ్ మెయిన్లకు అనుసంధానిస్తారు. దీంతో కోకాపేట, కొల్లూరు, ఐటీ కారిడార్ ప్రాంతాలకు నేరుగా గోదావరి జలాలను అందించే అవకాశం వుంది. ఇక మరో 5 టీఎంసీల నీటిని కూడా ఘనపూర్ నుంచి ముత్తంగి మీదుగా 22 ఎంఎం డయా కలిగిన పైప్‌లైన్ ను ఔటర్ రింగ్‌రోడ్ అవతలి భాగం నుంచి ముత్తంగి, కొల్లూరు, ఇంద్రారెడ్డి కాలనీ, జన్వాడ మీదుగా జన్వాడా–ఖనాపూర్ మధ్యలో నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు నిర్మిస్తారు.
ఈ పైప్‌లైన్ ను దాదాపు 58 కిలో మీటర్ల వరకు నిర్మించనున్నారు. ఉస్మాన్‌సాగర్ నిండిన తర్వాత హిమాయత్‌సాగర్‌ను నింపుతారు. జంటజలాశయాలు నిండిన తర్వాత నీటిని మూసీలోకి వదులుతారు. ఈ రెండు జలాశయాల కింద హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కొత్తగా మరో రెండు నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఉస్మాన్‌సాగర్ దిగువన 120 ఎంఎల్డీ, హిమాయత్ సాగర్ దిగువన 70 ఎంఎల్డీ కెపాసిటీగల నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు.
రూ.5,560 కోట్లతో రెండోదశ
హైదరాబాద్ మహానగరానికి 15 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్ నుంచి తరలించాలన్నదే గోదావరి ఫేజ్–2 లక్ష్యం. ఇందులో 10 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, మరో 5 టీఎంసీల నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నింపి, మూసీ నదిని శుద్ధి చేసేందుకు వినియోగించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులకుగానూ రూ. 5,560 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఈ పనులను రెండేండ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది పూర్తయితే 2050 నాటికి హైదరాబాద్ నగరానికి రోజుకు 1,014 ఎంజీడీల నీటిని అందించడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఘనపూర్ వద్ద 780 ఎంఎల్డీ (మెగా లీటర్ ఫర్ డే) కెపాసిటీగల నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని తరలించడానికి 2,400 ఎంఎం డయా మీటర్ భారీ పైప్‌లైన్‌ను నిర్మించి, జంటనగరాలకు నీటిని తరలిస్తారు. కేవలం తాగునీటి అవసరాలకే కాకుండా మూసీ శుద్ధికి కూడా 5 టీఎంసీల నీటిని తరలించడానికి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీటిని పటాన్చెరు మీదుగా ముత్తంగి వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేరకు మరో పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు.