- మక్కల కొనుగోళ్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్
- మార్క్‌ఫెడ్ ద్వారా కొనేందుకు ఏర్పాట్లు
- నష్టం వస్తోందని మూడేండ్లు కొనని సర్కారు
- ఎలక్షన్ ఇయర్ కావడంతో ఈసారి సేకరణకు నిర్ణయం
- ఇప్పటికే లక్షలాది టన్నులు అగ్గువకు అమ్ముకున్న రైతులు
- మార్క్‌ఫెడ్ ద్వారా కొనేందుకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: యాసంగి మక్కల కొనుగోళ్లకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ యేడు యాసంగిలో రాష్ట్రంలో మక్కలు భారీగా సాగవడంతో వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ఈ అంశంపై ఏప్రిల్ 24న మక్కల ధర 20 రోజుల్లో రూ.900 తగ్గిందంటూ ‘వెలుగు’ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ నేపథ్యంలో సర్కారే మక్కలు కొనాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం నుంచి వ్యక్తమైంది. ధర గణనీయంగా తగ్గుతుండడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమించే పరిస్థితులు వచ్చాయి. దీంతో మక్కలు కొంటే లాస్ వస్తోందని గత మూడేండ్లుగా కొనుగోళ్లు నిలిపివేసిన రాష్ట్ర సర్కారు.. ప్రస్తుతం రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడం, మరో వైపు ఈయేడు ఎలక్షన్ ఇయర్ కావడంతో రైతులను ప్రసన్నం చేసుకోవడానికి ఎట్టకేలకు సర్కారు మక్కల కొనుగోళ్లకు సిద్ధమైంది. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయా లని గురువారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
17 లక్షల టన్నుల దిగుబడి అంచనా
రాష్ట్రంలో ఈ యాసంగిలో 6.50 లక్షల ఎకరాల్లో మక్క సాగైంది. ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు, యావరేజీగా 26.80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యసాయశాఖ అంచనా వేసింది. సాగు విస్తీర్ణం ప్రకారం 17.37 లక్షల టన్నులు వస్తుందని అంచనాలున్నాయి. గత నెల 17 నుంచి కురిసిన అకాల వర్షాలకు మక్కపంట దెబ్బతిన్నది. సర్కారు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది టన్నుల మక్కలను ప్రైవేటు వ్యాపారులు అగ్గువకు కొనుగోలు చేశారు. క్వింటాల్ రూ.1,600, రూ.17,00 లకు మించి ధర పెట్టడం లేదు. పంట చేతికొచ్చిన సమయంలో దళారులు ధరలు తగ్గించి కొంటుండడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో సర్కారు మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలుకు నిర్ణయించింది.