విద్యాశాఖలో ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్ల సందడి

విద్యాశాఖలో ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్ల సందడి
  •     నేడు టీచర్ల సీనియారిటీ, వేకెన్సీ లిస్ట్ విడుదల  
  •     గతంలో బదిలీ అయిన 193 మంది ఎస్​ఏలు రిలీవ్​  
  •     జిల్లాలో టీచర్​ పోస్టుల ఖాళీలు పెరిగే అవకాశం  

మంచిర్యాల, వెలుగు : చాలాకాలం తర్వాత విద్యాశాఖలో ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ నెల 8 నుంచి 22 వరకు 15 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. గత సెప్టెంబర్​లో బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు చేపట్టింది. అయితే ఎలక్షన్​ కోడ్​ కారణంగా అప్పుడు అర్ధాంతరంగా బ్రేక్ పడ్డది. ప్రస్తుత సర్కారు దానికి కొనసాగింపుగా టీచర్ల ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లకు షెడ్యూల్​ రిలీజ్​ చేసింది. ఈ నెల 22 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మళ్లీ విద్యాశాఖలో సందడి మొదలైంది.  

నేడు సీనియారిటీ లిస్ట్ రిలీజ్

ప్రమోషన్ల ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత ట్రాన్స్​ఫర్లు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లకు అర్హత గల సెకండరీ గ్రేడ్ ​టీచర్లు (ఎస్​జీటీలు), స్కూల్ ​అసిస్టెంట్ల (ఎస్ఏ) సీనియారిటీ లిస్టులు రెడీ చేసి ఆదివారం రిలీజ్​చేయనున్నారు. అనంతరం సీనియారిటీ లిస్టులపై 10,11 తేదీల్లో టీచర్ల నుంచి డీఈవో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. గత సెప్టెంబర్​లోనే సీనియారిటీ లిస్ట్ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత పలువురు రిటైర్​కావడంతో పాటు వివిధ కారణాలతో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో సీనియారిటీ లిస్టును సవరించి రిలీజ్​చేయనున్నారు.

రిలీవ్ అయిన స్కూల్​ అసిస్టెంట్లు

గత సెప్టెంబర్​లో చేపట్టిన బదిలీల్లో 352 మంది స్కూల్​అసిస్టెంట్లకు అవకాశం లభించింది. ఇందులో లోకల్​ బాడీస్​ స్కూళ్లలో 322 మంది, గవర్నమెంట్​ స్కూళ్లలో 30 మంది ట్రాన్స్​ఫర్ ​అయ్యారు. ఎస్​జీటీల కోర్టు కేసు పెండింగ్​లో ఉండడం వల్ల కొంతమంది స్కూల్​ అసిస్టెంట్లకు బదిలీ​అయిన స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో వారు గత 8 నెలలుగా అదే స్థానాల్లో పనిచేస్తున్నారు. తాజా బదిలీల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పెండింగ్ ఉన్న 193 మంది స్కూల్​అసిస్టెంట్లను శనివారం రిలీవ్ చేశారు. వెంటనే వారు బదిలీ అయిన స్థానాల్లో రిపోర్ట్ చేశారు.

పెరగనున్న ఖాళీలు..

 ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లతో జిల్లాలో భారీగా టీచర్​ పోస్టుల ఖాళీలు ఏర్పడే అవకాశముంది. జిల్లాలోని గవర్నమెంట్, లోకల్​ బాడీస్​ స్కూళ్లలో కలిపి 2839 పోస్టులు సాంక్షన్​ కాగా, ప్రస్తుతం 2347 మంది పనిచేస్తున్నారు. ఇందులో 492 వేకెన్సీలను గుర్తించారు. నిరుడు సెప్టెంబర్​ తర్వాత పలువురు టీచర్లు రిటైర్​ కావడం, చనిపోవడం వల్ల ప్రస్తుతం ఖాళీల సంఖ్య పెరిగే చాన్స్​ ఉంది. మండల ఎడ్యుకేషన్​ ఆఫీసర్ల నుంచి ఖాళీల వివరాలను తీసుకుంటున్నారు. సీనియారిటీతో పాటు వేకెన్సీ లిస్టును ఆదివారం ప్రకటిస్తామని డీఈవో యాదయ్య తెలిపారు.