హైదరాబాద్‌లో కలకలం రేపిన కిడ్ని రాకెట్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కిడ్ని రాకెట్ వ్యవహారంలో నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ కేసు సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, ఈ రాకెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకోవాలని ఆదేశించారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని మంత్రి దామోదర రాజనర్సింహా హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్‌లోని సరూర్ నగర్లో కిడ్ని రాకెట్ దందా వెలుగులోకి వచ్చింది. అమాయకుల్ని ఆసరాగా చేసుకొని సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలోని అలకనంద హాస్పిటల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నారు. ఆ నోట ఈ నోట విషయం బయటకు పొక్కడంతో అలకనంద హాస్పిటల్ లో పోలీసులు, వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. అమాయకుల అవసరాలను ఆసరాగా తీసుకుని అనుమతి లేకుండా కిడ్ని మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ALSO READ | హైదరాబాద్ లో మైనర్ బాలికపై హత్యాయత్నం.. రెండు చేతులు బ్లేడ్ తో కోసిన దుండగులు..
ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి.. పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లను తీసుకొచ్చి సైలెంట్‌గా కిడ్ని మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఒక్కొ కిడ్నికి రూ.55 లక్షలు బేరం కుదుర్చుకుని.. అందులో కిడ్ని ఇచ్చిన డోనర్లకు కేవలం రూ.5, 10 లక్షలే ఇస్తున్నట్లు తెలిసింది. మిగిలిన డబ్బుంతా మధ్యవర్తులు, డాక్టర్లు, ఆసుపత్రి నిర్వహకులు మింగేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇప్పటికే వైద్యాధికారులు అలకనంద ఆసుపత్రిని పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించారు. అలాగే.. అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ సుమంత్‌ను సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యాధికారులు అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ కిడ్ని రాకెట్ దందా వెనక పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యయంలోనే కిడ్ని రాకెట్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర సర్కార్.. ఈ కేసును సీఐడీకి అప్పగించింది.