సాయం పెరిగింది.. వన్య ప్రాణుల దాడుల నష్ట పరిహారాన్ని పెంచిన ప్రభుత్వం

  •      వ్యక్తి చనిపోతే 10 లక్షలు, గాయపడితే లక్ష
  •      పశువులకు 20 వేల నుంచి 50 వేలకు పెంపు
  •      ఉమ్మడి జిల్లాలో నిత్యం పంటపొలాలు, మనుషులపై అడవి పందుల దాడులు 

ఆదిలాబాద్, వెలుగు: వన్య ప్రాణుల దాడుల్లో చనిపోయే వారికి చెల్లించే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం పెంచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవికి ఆనుకొని ఉన్న వేల ఎకరాల పంట పొలాలను అడవి జంతువులు నష్టం చేస్తున్నాయి. కొన్ని సమయాల్లో మనుషులు, పశువులపై కూడా దాడి చేసిన సందర్భాలున్నాయి. ఇలా గాయపడిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ.. రెండేండ్ల నుంచి పరిహారం రాకపోవడంతో బాధిత కుటుంబాలు ఆస్పత్రుల బిల్లులు కట్టలేక నష్టపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే బాధితులకు ఉపశమనం కలిగించేందుకు నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పరిహారాన్ని పెంచుతూ ఇటీవల అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

అవగాహన లేక..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 17 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల రైతులు అటవీ సమీపంలోని పంట పొలాల్లో మొక్కజొన్న, వేరుశనగ, పత్తి  పంటలను సాగు చేస్తారు. వీటికి కాపలాగా ఉండే రైతులు, పశువుల కాపరులు అటవీ జంతువుల దాడిలో గాయాల పాలవుతున్నారు. పులి దాడిలో గాయపడటంతోపాటు ఎన్నో పశువులు వాటి దాడిలో చనిపోయిన సందర్భాలున్నాయి. బోథ్, తాంసి, తలమడుగు, భీంపూర్, గుడిహత్నూర్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ప్రాంతాల్లో ఇటీవల చిరుత పులి దాడులతో పశువులు మృత్యువాత పడ్డాయి. 

అడవికి సమీపంలో ఉన్న గ్రామాల్లోని పంటలను అడవి పందులు తీవ్రంగా నష్టపరుస్తాయి. నష్టపోయిన పంటలకు అటవీశాఖ పరిహారం ఇస్తుందని చాలా మందికి అవగాహన లేదు. గాయపడిన, చనిపోయిన కుటుంబసభ్యులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వస్తుందని అవగాహన లేకపవడంతో దరఖాస్తులు కూడా చేసుకోవడం లేదు. 

వన్య ప్రాణుల దాడుల్లో చనిపోయిన వ్యక్తికి గతంలో రూ. 5 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ. 75 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. పంటలకు నష్టం జరిగితే ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.7,500, పశువులు చనిపోతే రూ.20 వేల నుంచి రూ.50 వేలకు సాయాన్ని పెంచుతూ అటవీశాఖ ఈమధ్యే నిర్ణయించింది. 

దరఖాస్తులు చేసుకుంటేనే సాయం

అటవి జంతువుల దాడుల్లో మనుషులు చనిపోయినా, పంట నష్టం జరిగినా రెండు రోజుల్లో బాధితులు ఫారెస్టు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ అధికారి, రెవెన్యూ అధికారి, అటవీ శాఖ అధికారి సంయుక్తంగా సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపడతారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఉన్నత అధికారులకు నివేదిక ఇచ్చిన అనంతరం నష్ట పరిహారాన్ని అందిస్తారు. అయితే, కొందరు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పరిహారం రావడం లేదు. కొన్ని సందర్భాల్లో అధికారుల విచారణ ఆలస్యం చేస్తుండడంతో పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 

ఈ ఏడాది జిల్లాలో  జరిగిన పలు సంఘటనలు
    

జూన్ 28న గుడిహత్నూర్ మండలంలోని డోంగ్రగావ్​కు చెందిన స్వప్న అనే 17 ఏళ్ల బాలిక పత్తి విత్తనాలు వేసేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో వెనుక నుంచి అడవి పంది దాడి చేసింది. ఆమె చేతికి తీవ్ర గాయం కాగా ప్రాణపాయస్థితి నుంచి బయటపడింది.

నాలుగు రోజుల క్రితం గుడిహత్నూర్ మండలంలోని ధామస్​గూడ ఫారెస్టు బీట్ పరిధిలో అటవీ సమీపంలో మేత కోసం వెళ్లిన ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. 
    

సెప్టెంబర్ 26న పొలం పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న భీంపూర్ మండలంలోని గొల్లగఢ్​ తాంసికి చెందిన రాకేశ్, లక్ష్మణ్​​పై అడవి పంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. 


అక్టోబర్ 24న భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి సరిహద్దులో పులి దాడిలో ఆవు, దూడ చనిపోయాయి. 
    

2022 నవంబర్ 15న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చౌపన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఖానాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆదివాసీ రైతు సిడాం భీము(69) పులిదాడిలో మృతి చెందాడు. ఉదయం గ్రామ సమీపంలోని ధర్మగుట్ట ప్రాంతంలోని తన చేనులో పత్తి ఏరుతుండగా ఒక్కసారిగా పులి అతడిపై దాడి చేసి కొండ ప్రాంతం నుంచి ఈడ్చుకెళ్లింది. ఈ దాడిలో అతడు అక్కడే చనిపోయాడు.