ఏపీనే నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వం కొత్త వాదన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: గోదావరి కరకట్టల నిర్మాణం, వరదల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. నిధులు విడుదల చేయలేక.. కొత్తవాదనను తెరపైకి తీసుకొచ్చింది. భద్రాచలంలో కరకట్ట నిర్మాణానికి ఏపీ ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పోలవరం వల్లే భద్రాచలానికి ముంపు వాటిల్లుతోందని పక్క రాష్ట్రమే నిధులు చెల్లించాలని చెబుతోంది. కాగా, పోలవరం వల్ల ఎలాంటి ముంపు లేదని, తామెందుకు ఫండ్స్ ఇస్తామని ఏపీ వాదిస్తోంది. దీంతో గోదావరిపై కరకట్ట నిర్మాణం పెండింగ్ లో పడింది. గతంలో సీఎం కేసీఆర్ ఇస్తానన్న రూ.వెయ్యి కూడా పత్తా లేకుండా పోయాయి.

పొంతన లేని మెలిక..

గతేడాది జూలైలో గోదావరి ఉగ్రరూపానికి భద్రాచలంతో పాటు బూర్గంపహడ్, చర్ల, పినపాక, దుమ్ముగూడెం, కరకగూడెం, అశ్వాపురం, మణుగూరు మండలాల్లోని గ్రామాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పంటలన్నీ నీట మునిగాయి. ఇండ్లు కూలిపోయాయి. దీంతో జూలై 17వ సీఎం కేసీఆర్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. సర్వే చేసిన ఆఫీసర్లు కరకట్ట, నిర్వాసితులకు పునరావాసం తదితర పనులకు రూ.1585కోట్లు అవసరం అవుతాయని ప్రపోజల్స్ రెడీ చేశారు. ఏడు నెలలు గడిచినా ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు. రివ్యూ మీటింగ్​లో ఏపీ వల్లే వరద ముప్పు ఏర్పడిందని ఎలాంటి చర్చ రాలేదు. ఇప్పుడు మాత్రం ఏపీ వల్లే ఇదంతా అంటూ కొత్త వాదన వినిపిస్తోంది. భద్రాచలం నుంచి సున్నం బట్టి వరకు కొత్త కరకట్టల నిర్మాణంతో పాటు పాత కరకట్ట రిపేర్లు, బలోపేతానికి ఫండ్స్​మొత్తం ఏపీ సర్కార్​ భరించాలని చెబుతోంది. పోలవరం వల్లే గ్రామాలు నీట మునిగాయని గత రిపోర్టులు చూపిస్తూ.. వాదనలు వినిపిస్తోంది. ఏపీ మాత్రం పోలవరం నుంచి ఎలాంటి ముంపు లేదని, తామెందుకు ఇస్తామని చెబుతోంది.

జాడలేని రూ. వెయ్యి కోట్లు..

భద్రాచలానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో ముంపు గ్రామాల ప్రజలు సంతోషంగా వ్యక్తం చేశారు. వరద బాధితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, గోదావరి నదికి కరకట్ట, అవసరమైన చోట్ల వంతెనలు నిర్మిస్తామని చెప్పారు. కానీ ఏడు నెలలు దాటినా రూపాయి రిలీజ్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలోనే పనులు మొదలుపెట్టాల్సి ఉన్నా ఇప్పటివరకు చడీచప్పుడు లేదు. మంత్రి పువ్వాడ అజయ్ సైతం దీనిపై ఎలాంటి రివ్యూ చేయడం లేదు.

తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు..

గోదావరి వరదల టైంలో రాష్ట్ర ప్రభుత్వం.. ఉన్నతాధికారులను ముంపు ప్రాంతాలకు పంపింది. నిర్వాసితులను ఆదుకోవడం, పునరావాసం కల్పించడం, భోజనం, తాగునీరు, టాయిలెట్ల సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షణకు వచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడతో తహసీల్దార్లే పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. భద్రాచలంతో పాటు బూర్గంపహడ్, చర్ల, మణుగూరు, అశ్వాపురం, దుమ్ముగూడెం, పినపాక మండలాలకు చెందిన అధికారులు దాదాపు రూ.8కోట్ల మేర ఖర్చులు చూపిస్తూ నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కానీ నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా సర్కారు విదల్చలేదు. దీంతో తహసీల్దార్లు తలలు పట్టుకుంటున్నారు.