- రెండు నెలల్లో పూర్తి చేయాలని ఉత్తర్వులు
- ఇంటింటి సర్వేలో వివరాల సేకరణ
- నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సీఎస్ శాంతికుమారి జీవో ఎంఎస్ 18ని జారీ చేశారు. ఇంటింటి సర్వే చేపట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, ఉద్యోగ వివరాలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ఈ ఏడాది ఫిబ్రవరి 4న కేబినెట్లో తీసుకున్న నిర్ణయం, అసెంబ్లీ తీర్మానానికి తగ్గట్టు కులగణన చేపట్టనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. 60 రోజుల్లోగా కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇప్పటికే కులగణన చేపట్టిన రాష్ట్రాల్లో అధ్యయనం..
లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. ఇందుకు సమగ్ర కులగణన చేపట్టి జనాభా వివరాలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఎంపీ ఎన్నికలకు ముందు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడంతో పాటు కులగణనకు రూ.150 కోట్ల మంజూరుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కులగణన పూర్తి చేశాకే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పలుమార్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటికే కులగణన చేపట్టిన బీహార్, ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో గత బీసీ కమిషన్ చైర్మన్, నేతలు పర్యటించి అక్కడ చేపట్టిన ప్రాసెస్ ను పరిశీలించి, క్వశ్చనీర్, గైడ్ లైన్స్ ను రెడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్అందజేశారు. గత నెలలో బీసీ కమిషన్ గడువు పూర్తి కావడంతో కొత్త కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. అనంతరం బీసీ సంఘాలు సీఎం, మంత్రులను కలిసి కులగణనపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీలకు సర్కారు దసరా కానుక: జాజుల శ్రీనివాస్
సమగ్ర కులగణనపై ప్రభుత్వం ఇచ్చిన జీవో బీసీలకు దసరా కానుక. నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెం ట్ను నియమించడం అభినందీనయం. కులగణనపై ఉత్తర్వులు ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో సీఎంను బీసీ సంఘాలు కలిసిన 24 గంటల్లోపే జీవో ఇచ్చారు. బీసీ సమాజం నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు. దీనిపై ఎవరు రాజకీయ కుట్రలు చేయకుండా గణను సాఫీగా జరిగేలా అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు సహకరించాలి.
ఉద్యోగులతో కులగణన చేయించాలి: ఆర్ కృష్ణయ్య
సమగ్ర కులగణన ప్రభుత్వ ఉద్యోగులతో చేయించి.. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. ఈ గణన తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో ఆ వివరాలు ప్రకటించాలి. రిజర్వేషన్ల పెంపుపై రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.