హైదరాబాద్లో ఇలా చేస్తున్న కోచింగ్ సెంటర్లకు ఇక మూడినట్టే..!

హైదరాబాద్లో ఇలా చేస్తున్న కోచింగ్ సెంటర్లకు ఇక మూడినట్టే..!

ఢిల్లీ: కోచింగ్ సెంటర్ల అతి ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘మా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే 100కి 100 శాతం జాబ్ సెక్యూరిటీ ఇస్తాం.. నూటికి నూరు శాతం జాబ్ గ్యారంటీ’ ఇలాంటి ప్రకటనలు ఇకపై కనిపించకూడదని కోచింగ్ సెంటర్లను కేంద్రం హెచ్చరించింది. ఇలాంటి మోసపూరిత, అవాస్తవ ప్రకటనలతో కోచింగ్ సెంటర్లు అభ్యర్థులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లకు కేంద్రం బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) తుది మార్గదర్శకాలను కేంద్రానికి సమర్పించింది. అడ్డగోలుగా ప్రకటనలిస్తూ, ఆంక్షలను ఉల్లంఘించి నడుపుతున్న కోచింగ్ సెంటర్లకు సీసీపీఏ ఇప్పటికి 54 నోటీసులను జారీ చేసింది. రూ.54.60 లక్షల జరిమానా విధించింది. సెలక్షన్ తర్వాత లేదా జాబ్ వచ్చాక అభ్యర్థుల నుంచి ఎలాంటి రాతపూర్వక అంగీకారం తీసుకోకుండా వారి పేర్లను, ఫొటోలను, ఇతర వివరాలను ప్రకటనల్లో కోచింగ్ సెంటర్లు వాడకూడదని మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది.

ALSO READ | తెలంగాణ చరిత్రలో ఇంత దారుణమైన దాడులు ఎన్నడూ జరగలే: మంత్రి రాజనర్సింహ

చాలామంది యూపీఎస్సీ స్టూడెంట్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ను స్వతహాగా కష్టపడి చదువుకుని కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్ మాత్రమే కోచింగ్ సెంటర్ల నుంచి తీసుకుంటారని కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే తెలిపారు. ఇలాంటి అభ్యర్థుల ఫొటోలను తమ కోచింగ్ సెంటర్ల వల్లే సివిల్స్ క్లియర్ చేసినట్టుగా కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రచారం చేసుకుంటున్నాయని ఆమె చెప్పారు. ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు.

కోచింగ్ సెంటర్లకు తాము వ్యతిరేకం కాదని, కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో మాత్రమే ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను కోచింగ్ సెంటర్లు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, భారీ జరిమానాలు విధిస్తామని కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే హెచ్చరించారు.