తెలంగాణను డ్రగ్స్​ రహిత రాష్ట్రంగా మారుస్తం

తెలంగాణను డ్రగ్స్​ రహిత రాష్ట్రంగా మారుస్తం
  • యువత కోసం స్కిల్​ వర్సిటీ పనులు ప్రారంభించినం
  • రైతులకు రూ. 31 వేల కోట్లు మాఫీ చేసినం 
  • రాష్ట్ర ప్రభుత్వానికి బ్రహ్మ కుమారీస్ మార్గదర్శకులు 
  • బ్రహ్మకుమారీస్ ​శాంతి సరోవర్ ద్వి దశాబ్ది వేడుకల్లో సీఎం

హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్స్ టీమ్ ను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆదివారం బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్ ద్వి దశాబ్ది కార్యక్రమంలో సీఎం రేవంత్  పాల్గొని మాట్లాడారు. ఇది ప్రజా ప్రభుత్వమని, రైతు ప్రభుత్వమని తెలిపారు. రైతు రుణమాఫీ చేసి తమది రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నామన్నారు. 

దేశంలో ఎక్కడలేని విధంగా ఎనిమిది నెలల్లోనే రూ.31 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని ఆయన తెలిపారు. యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామని..  60 ఎకరాల్లో రూ. 300 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు వివరించారు. ముచ్చెర్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని.. అక్కడే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. బ్రహ్మకుమారీస్ బాటలో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని చెప్పారు. 

Also Read:-వచ్చే అకడమిక్ ​ఇయర్​లో స్పోర్ట్స్​ వర్సిటీ

ఇరవయ్యేండ్లలో  గచ్చిబౌలి పెద్ద నగరంగా అభివృద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండటం సంతోషకరమైన విషయమని సీఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి  బ్రహ్మకుమారీస్ మార్గదర్శకులని,  శాంతి సరోవర్ కు తమ  ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. శాంతి సరోవర్ లీజ్ రెన్యూవల్ చేసి వారికి అన్నివిధాలా సహకరిస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో  మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు ప్రకాశ్​గౌడ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.