న్యూఢిల్లీ: కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగాల కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమును తెచ్చే ప్లాన్ పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కెమికల్స్, పెట్రోకెమికల్స్ ప్రొడక్షన్లో ఇండియాను మాన్యుఫాక్చరింగ్హబ్గా చేయడానికి పీఎల్ఐ సాయపడుతుందని చెప్పారు. కఠినమవుతున్న పొల్యూషన్ కంట్రోల్ రెగ్యులేషన్లు, లేబర్ ఖర్చుల నేపథ్యంలో కెమికల్స్ తయారీ రంగంలోని గ్లోబల్ మాన్యుఫాక్చరర్లు తమ ప్రొడక్టులలో మార్పుతోపాటు, సామర్ధ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి టైములో వారికి ఇండియా సరైన వేదికవుతుందని నిర్మలా సీతారామన్ సూచించారు.
మన దేశంలో మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టే ఆలోచనను ఆయా గ్లోబల్ కంపెనీలు చేయొచ్చని పేర్కొన్నారు. అంతేకాదని, మన దేశపు మార్కెట్ కూడా పెద్దదవడం ఆ గ్లోబల్ కంపెనీలకు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా సమ్మిట్‌లో ఫైనాన్స్ మినిస్టర్ గురువారం నాడు పాల్గొన్నారు. కొత్త మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలంటే అనుకూలతలు ఉండాలని, దేశీయ వినియోగం ఒక అనుకూలత కాగా, ఎగుమతులు ఎటూ నిర్వహించుకునే వీలుంటుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇలాంటప్పుడే ప్రభుత్వ విధానాలు సానుకూలంగా ఉండటం అవసరమని వివరించారు.
ఇండియా మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ, ఈ దిశలో కెమికల్స్, పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీ కోసం పీఎల్ఐ స్కీము ప్రపోజల్ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సస్టెయినబిలిటీ, కార్బన్ ఎమిషన్, జనరల్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ పెంచుకునే దిశలో చర్యలు తీసుకోవాలన్నారు. ఎనర్జీ రంగంలో 2047 నాటికి స్వయం ప్రతిపత్తి సాధించాలని, 2070 నాటికి నెట్ జీరో కార్బన్ దేశంగా మారాలని టార్గెట్‌గా పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నెట్ జీరో కార్బన్ లక్ష్యాన్ని అందుకోవాలంటే...అన్ని రంగాలలోని పరిశ్రమల సహకారంతోనే సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
ALSO READ:వర్షాల బాధితులను ఆదుకోండి.. కలెక్టర్లకు బండి సంజయ్ ఫోన్
గ్రీన్ గ్రోత్ పైనే ఫోకస్....
గ్రీన్ గ్రోత్‌పై ఫోకస్ పెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కార్బన్ ఇంటెన్సిటీ తగ్గించే దిశలో చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంథన సామర్థ్యం, రెన్యువబుల్ ఎనర్జీ కమిట్మెంట్స్ను దేశం కాపాడుకోవడం ఆవశ్యకమని చెప్పారు. ప్రైవేటు రంగం నెట్ జీరో గోల్, 500 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ కెపాసిటీ అంశాలను గుర్తు పెట్టుకోవాలని కోరారు. హైడ్రోజన్ మిషన్‌ను కూడా దృష్టిలో పెట్టుకోమని సూచించారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్‌ను ప్రమోట్ చేసేందుకు రూ. 19,744 కోట్లతో ఇన్సెంటివ్ ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. ఏడాదికి కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏర్పాటును నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.