DSC-98 బాధితులకు 21 ఏళ్లుగా ఎదురుచూపులే!

డీఎస్సీ–98  పూర్తయి 21 ఏళ్లు గడిచిపోయాయి. క్వాలిఫై అయినవాళ్లు ఇన్నేళ్లుగా న్యాయం కోసం అలుపెరుగకుండా పోరాడుతూనే ఉన్నారు.   ఉద్యోగాలు రాలేదన్న బాధతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వందమందికి పైగా చనిపోయినట్లు సమాచారం. తమకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా అని బాధితులు ఎదురుచూస్తున్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో నిర్వహించిన 1998 మెగా డీఎస్సీ అవినీతి, అక్రమాలకు పుట్టగా మారింది. బాబు పరిపాలనకు అదొక మాయని మచ్చగా మారింది.  విద్యాశాఖలో కొంతమంది ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై  టీచరు పోస్టుల నియామకాలను భ్రష్టు పట్టించారు. కౌంటర్లు పెట్టి సొమ్ములు వసూలు చేసినట్లు, ఇంటర్వ్యూలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు జోరుగా విమర్శలు వచ్చాయి. పరీక్షా కేంద్రాల్లో అనేక అవకతవకలు జరిగినట్లు వార్తలందాయి. మెరిట్ కేండిడేట్లు రోడ్డున పడితే, మార్కులు తక్కువ వచ్చినవారికి అక్రమాల ఫలితంగా ఉద్యోగాలు వచ్చాయి. డీఎస్సీ–1999 నిర్వహణలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీవ్రంగా అభాసుపాలైంది. ఈ నేపథ్యంలో డీఎస్సీ–1998 సమస్యను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎన్నికల్లో గెలిచి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కడప, అనంతపురం జిల్లాల క్వాలిఫైడ్స్ కు టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు ట్రిబ్యునల్ కూడా తీర్పు ఇచ్చాయి. ఈ పరిస్థితుల్లో డీఎస్సీ బాధితులకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి వైఎస్ సిద్దపడుతున్న సమయంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో… తెలంగాణ ప్రభుత్వం వచ్చాక డీఎస్సీ–98 బాధితులకు న్యాయం చేస్తామని కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ భరోసా ఇచ్చారు. అంతేకాదు, తెలంగాణ ఏర్పడి ముఖ్యమంత్రి అయ్యాక 2016 జనవరి మూడో తేదీన డీఎస్సీ–98 ప్రతినిధి బృందం కలిసినప్పుడు  టీచర్ ఉద్యోగాల కల్పనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల సమయంలో, కోడ్ అమల్లోకి  రావడానికి ముందు అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో మీడియా సమావేశం పెట్టించి… త్వరలోనే డీఎస్సీ–1998 క్వాలిఫైడ్స్‌‌కి టీచర్ ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం తరఫున ప్రకటన కూడా చేయించారు. ఈ హామీ అమలులో ప్రభుత్వం జాప్యం చేసింది.  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కి లేఖలు రాశారు. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలని కోరారు.  ఉపాధ్యాయ సంఘాల జాక్టో కూడా బాధితులకు న్యాయం చేయాలని సీఎంకి కోరాయి.

ఇంత జరిగినా ఇప్పటివరకు బాధితులకు టీచర్ ఉద్యోగాలు రాలేదు. మెరిట్ ఉన్నా ఉద్యోగాలు రాలేదనే బాధతో తెలంగాణలో 50 మందికి పైగా క్వాలిఫైడ్స్ గుండెపోటుకు గురై చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌‌లో ఏకంగా 80 మందికి పైగా చనిపోయారు. ఏదోక రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఉద్యోగాల తీపి కబురు వస్తుందనే ఆశతో డీఎస్సీ బాధితులు ఎదురు చూస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌‌కి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా డీఎస్సీ బాధితులను పట్టించుకోవాలి.