మూడేళ్లు దాటినా..సర్కార్​ సాయం అందలే..!

  • మూడేళ్లు దాటినా..సర్కార్​ సాయం అందలే..!
  • 2020నాటి వేదాద్రి ప్రమాదంలో12 మంది మృతి
  • రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలు
  • రెండు వారాల్లోనే  ఏపీ సర్కార్​అందజేత
  • ఒక్కొక్కరికీ రూ.5 లక్షల  చొప్పున సాయం

ఖమ్మం/ ఎర్రుపాలెం, వెలుగు:  మూడేళ్ల కిందట మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లిన ఓ కుటుంబానికి ఇసుక లారీ రూపంలో మృత్యువు ఎదురైంది. వేదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకొని ట్రాక్టర్ లో తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన12 మంది చనిపోయారు. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ప్రమాదం జరగడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అనౌన్స్ చేసింది. ప్రమాద ఘటన జరిగిన 2 వారాల్లోపే మొత్తం మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్​ పరిహారం అందించింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల పరిహారం మాత్రం ఇప్పటి వరకు అందలేదు. ఘటన జరిగి మూడేళ్లవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై మృతులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అసలు జరిగింది..?

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన రైతు వేమిరెడ్డి గోపిరెడ్డి కుటుంబం తలనీలాలు, మొక్కులు చెల్లించుకునేందుకు బంధువులతో కలిసి 2020, జూన్16న ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రికి వెళ్లారు. అక్కడే రాత్రి బస చేసి, తెల్లవారు స్వామివారికి మొక్కులు చెల్లించుకొని, మధ్యాహ్నం సొంతూరు బయల్దేరారు. ఆలయం నుంచి 2 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత హేమాద్రి సిమెంట్ కర్మాగారం సమీపంలో ట్రాక్టర్ ను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొంది. ట్రాక్టర్ లో 25 మంది ఉండగా, ట్రక్కు విడిపోయి బోల్తాపడడంతో12 మంది చనిపోయారు. వీరిలో పెద్ద గోపవరం గ్రామానికి చెందిన వేమిరెడ్డి పుల్లారెడ్డి(60), వేమిరెడ్డి భారతమ్మ(40), వేమిరెడ్డి పద్మావతి(45), వేమిరెడ్డి ఉదయశ్రీ(7), భూమి రాజేశ్వరి(26), వేమిరెడ్డి కల్యాణి(18), శీలం లక్ష్మి(20), జమలాపురం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి అప్పమ్మ(40), లక్కిరెడ్డి అక్కమ్మ(45), కృష్ణా జిల్లా జయంతి గ్రామానికి చెందిన సమీప బంధువులు గూడూరు సూర్యనారాయణరెడ్డి(46), గూడూరు రమణమ్మ(40), గూడూరు ఉపేందర్​రెడ్డి(15) చనిపోయిన వారిలో ఉన్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణమని  తేలింది.  

మూడేళ్ల నుంచి అడుగుతున్నా...


యాక్సిడెంట్​ అయినాక ఒక్కొక్కోళ్లకు రూ.2 లక్షలు పరిహారం ఇస్తమన్నరు. నా కుటుంబంలోనే ఆరుగురు చనిపోయిండ్రు. ఇప్పటికీ సర్కారు నుంచి రూపాయి రాలేదు. జగన్ సర్కార్​మాత్రం యాక్సిడెంట్ అయిన 15 రోజుల్లోపే ఒక్కొక్కోళ్లకు రూ.5 లక్షల చెక్కులు అందించింది. దెబ్బలు తగిలినవాళ్లకు రూ.లక్ష చొప్పున ఇచ్చిండ్రు. జడ్పీ చైర్మన్​ కమల్​రాజును కలిసి మూడు సార్లు అడిగితే సీఎం దగ్గరే ఫైల్ పెండింగ్ ఉందంటున్నారు. 

- వేమిరెడ్డి గోపిరెడ్డి, పెద్దగోపవరం

నా కూతురు బతికుంటే ఉద్యోగం చేస్తుండే..

నా కూతురు శీలం లక్ష్మి యాక్సిడెంట్ లో చనిపోయింది. చదువులో, అన్నింట్లోనూ ఫస్ట్ క్లాస్ మార్కులే తెచ్చుకునేది. మా అమ్మాయి చనిపోవడం మా ఫ్యామిలీకి పెద్ద దెబ్బే. ఆమె ఉండుంటే ఉద్యోగం తెచ్చుకొని మాకు అండగా ఉండేది. సాయం చేస్తామన్న సర్కారు కూడా ఇంత వరకు పైసా ఇయ్యలేదు.

శీలం కృష్టాయమ్మ, పెద్దగోపవరం