ఫోన్ల రకాలను బట్టి చార్జీలేసుడేంది?..ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు

ఫోన్ల రకాలను బట్టి చార్జీలేసుడేంది?..ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ: ఒకే రకమైన రైడ్​కు ఫోన్ మోడళ్లను బట్టి వేర్వేరు చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఓలా, ఉబర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. రైడ్​కు వెహికల్ బుక్ చేసుకునేవాళ్లు ఉపయోగించే మొబైల్ ఫోన్​ను బట్టి కంపెనీలు వసూలు చేసే చార్జీల్లో తేడాలుంటున్నాయని ఇటీవల్ ఇంటర్నెట్​లో ఆందోళనలు రేకెత్తాయి. 

యాపిల్ ఫోన్ నుంచి బుక్ చేస్తే ఎక్కువ రేటు, యాండ్రాయిడ్ ఫోన్ నుంచి బుక్ చేస్తే మరో చార్జీ వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. వివరణ ఇవ్వాలంటూ ఓలా, ఉబర్ సంస్థలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి నోటీసులు పంపించారు. 

ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. వాడుతున్న ఫోన్ల రేటునును బట్టి ఒకే రూట్​కు వేర్వేరు చార్జీలు గుంజడం వినియోగదారుల హక్కులను కాలరాయడమే అవుతుందని, దోపిడీని సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. ఫుడ్ డెలివరీ, ఆన్​లైన్ టికెటింగ్ కంపెనీల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయోలేదో చెక్ చేయాలని అధికారులను ప్రహ్లాద్ జోషి ఆదేశించారు.