ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టాలి

ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టాలి

ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఎంపిక, పర్యవేక్షణ చేయటానికి.. ప్రభుత్వ అధికారులకు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన రిపోర్టులను ప్రభుత్వానికి అందజేయటానికి వాహనం సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. దీనికోసం ప్రభుత్వమే వాహనములను కోనుగోలు చేసి వినియోగించడం, ప్రయివేటు వాహనములను అద్దెకు తీసుకుని వాడుకోవడం జరుగుతున్నది.  ప్రభుత్వ, ప్రయివేటు వాహనములను వాడుతున్న పర్యవేక్షణాధికారులు వాహనములను తమ సొంత పనులకు వినియోగించుకోవడం పరిపాటిగా మారింది. కార్యాలయం పరిధిలోగల ప్రాంతాలను సందర్శించడం, తనిఖీలు చేయడం, ప్రజలను చైతన్యపరచే, సంక్షేమ పథకాల గురించి తెలియజేసే కార్యక్రమాల్లో పాల్గొనడం, అభివృద్ధి పనులను పర్యవేక్షించడం వంటి పనులకు మాత్రమే వాహనములను వినియోగించాలి. 

అధికార దుర్వినియోగం

అధికారి తను పనిచేసే కార్యాలయానికి నిర్ణయించిన పరిధిలో నివాసం ఉండకుండా విలాసవంతమైన ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అదే క్రమంలో స్థానికంగా నివాసం ఉంటున్నట్లుగా హౌజ్‌ రెంటు అలవెన్స్‌ నెలవారీగా పొందుతున్నారు. స్థానికంగా నివాసం ఉ౦డకపోవడం వల్ల సమయానికి విధులకు హాజరుకాలేక పోవడం, కొన్నిసార్లు విధులకు గైర్హాజరు కావడం జరుగుతోంది. అదే క్రమంలో ప్రభుత్వ, ప్రయివేటు వాహనములను పరిమితికి మించిన దూరం  తిరుగుతున్నారు. అధికారి పట్టణంలో నివాసం ఉండే గృహం వరకు ప్రభుత్వం కేటాయించిన వాహనములను వాడుతున్నారు.  తమ సొంత పనులకు, విందులకు, వినోదాలకు, సభలకు, వివిధ సమావేశాలకు తిరుగుతూ  ప్రజాధనాన్ని వృథా, దుర్వినియోగం చేస్తున్నారు. తమకు నిర్ధారించిన పరిధిలో పర్యటనలు, పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఆ ప్రదేశాలను సందర్శించకుండానే తప్పుడు రిపోర్టులు, లాగ్‌బుక్‌లలో తప్పుడు వివరాలు అందజేస్తున్నారు. తిరిగిన ప్రాంతాల మధ్య ఉన్న దూరంను మించి అధికంగా కిలోమీటర్లు తిరిగినట్లుగా చూపుతూ డీజిల్‌ ఖర్చుపేరుతో డబ్బులను స్వాహా చేస్తున్నారు.

విధుల్లో పారదర్శకత పెరగాలి

 ప్రయివేటు వ్యాపార అనుమతి వున్న ట్రావెల్స్‌ వాహనములు, టాక్స్​ ప్లేట్‌ కలిగిన వాహనములను అద్దెకు వినియోగించుకోవాల్సి ఉండగా, వారితో అగ్రిమెంట్లు చేసుకోవాల్సి ఉండగా .. అధికారులు తమ వ్యక్తిగత వాహనములను వినియోగిస్తూ తప్పుడు బిల్లులు పెట్టి ప్రభుత్వం ద్వారా ట్రెజరీ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు వేగవంతంగా, వీలైనంత మేరకు ప్రజల వద్దకే వెళ్ళి సేవలు అందించేందుకు కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నది. ప్రజాపాలన విజయవంతంగా సాగాలంటే ప్రతి ప్రభుత్వ అధికారి, పర్యవేక్షణాధికారులు వారి విధుల్లో సత్ఫలితాలు రావాలంటే, పారదర్శకత పెరగాలి.  ప్రజాధనం వృథాను, దుర్వినియోగాన్ని అరికట్టాలంటే ప్రభుత్వ, ప్రయివేటు వాహనములకు జీపీఎస్​ పరికరాలు బిగించడం ద్వారా వంద శాతం సత్ఫలితాలు వస్తాయి. ప్రజాధనం ఆదా అవుతుంది. వాస్తవ రిపోర్టులు ప్రభుత్వానికి అందుతాయి. కొందరు ప్రభుత్వ అధికారులు వ్యక్తిగత వాహనములు వాడుకుంటూ, ట్రావెల్స్‌ వారి టాక్స్​ప్లేట్‌ కలిగిన వాహనములను వాడుకున్నట్లుగా తప్పుడు, దొంగ అగ్రిమెంట్లు, బిల్లులు పెట్టి , బిల్లులను డ్రా చేస్తున్నారు.

 ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో ఈ విధమైన తప్పుడు బిల్లులు డ్రా చేస్తున్న విషయాలు కలవు.  పర్యవేక్షణాధికారులు సొంత వాహనములలో తిరుగుతూ అట్టి వాహనములపై ‘ప్రభుత్వ వాహనం’ అని స్టిక్కర్లు వేసుకుని బహిరంగంగా తిరుగుతున్న సంబంధిత మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ అమలు చేసే ఆర్​టీవో అధికారులు పట్టించుకోవడం లేదు.  ప్రభుత్వ వాహనాలకు, అద్దెకు తీసుకున్న వాహనములకు జీపీఎస్​ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలు పొందడం వందశాతం ఖాయం. అభివృద్ధి పనుల్లో నాణ్యత పెరగాలన్నా,  ప్రజాధనం వృథాను అరికట్టలన్నా ప్రభుత్వ వాహములకు తప్పనిసరిగా జీపీఎస్​ పరికరాలు బిగించాల్సిందే పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్దపీట వేయాల్సిందే.  ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

- డా. యర్రమాద కృష్ణారెడ్డి,అధ్యక్షుడు, సమాచార హక్కు వికాస సమితి