
- పెద్ద మనసు చాటుకున్న ఆఫీసర్లు, ఎమ్మెల్యే
కరీంనగర్, వెలుగు: ఆఫీసర్లే అమ్మానాన్న అయి అనాథ యువతి పెండ్లి చేశారు. తామంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. బాజా భజంత్రీలు, మేళ తాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. అతిథుల ఆశీర్వాదాలతో నిర్వహించగా ఆదివారం కరీంనగర్ లోని కళాభారతి ఆడిటోరియం వేదికైంది.
కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. వివరాల్లోకి వెళ్తే.. 2017లో తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథైన పూజ(మౌనిక)ను కరీంనగర్ బాల సదనంలో చేర్పించారు. ఇంటర్ తర్వాత ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్సు చేసి ఇంటర్న్ షిప్ చేస్తుండగా పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయి తేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
దీంతో యువతి అధికారులకు చెప్పడంతో యువకుడితో పాటు కుటుంబసభ్యులను సంప్రదించగా ఒప్పుకున్నారు. జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులు ముహూర్తం నిశ్చయించారు. యువతి పెండ్లికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులకు భోజన వసతులు కల్పించారు.
జిల్లా జడ్జి, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, ఎన్జీవో నేతలు, వివిధ శాఖల అధికారులు సాయమందించారు. పెండ్లి వేడుకలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీసీపీఓ పర్వీన్, స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు శోభారాణి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, సీడీపీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మౌనికకు అండగా ఉంటాం : కలెక్టర్ పమేలా సత్పతి
మౌనికకు జిల్లా యంత్రాంగం తరఫున తన ఆధ్వర్యంలో వివాహం జరిపించడం సంతోషంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి వ్యక్తం చేశారు. మౌనికకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారని తాము అండగా ఉంటామని, వాళ్లను ఉన్నత చదువులు చదివించాలని మౌనిక, సాయి తేజఈ కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేశామని తెలిపారు.