క్రిమినల్ రాజకీయ నాయకులకు శుభవార్త: సుప్రీంకోర్టులో కేంద్రం ఏం చెప్పిందో తెలిస్తే ఫుల్ హ్యాపీ..

క్రిమినల్ రాజకీయ నాయకులకు శుభవార్త: సుప్రీంకోర్టులో కేంద్రం ఏం చెప్పిందో తెలిస్తే ఫుల్ హ్యాపీ..

న్యూఢిల్లీ: భారత్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై సుప్రీం కోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయకుండా జీవిత కాల నిషేధం విధించాలని దాఖలైన ప్రజా హిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టులో కేంద్రం వాదనలు వినిపించింది.

జీవిత కాల నిషేధం అక్కర్లేదని.. ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల అనర్హత వేటుతో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధిస్తే సరిపోతుందని సుప్రీం కోర్టుకు కేంద్రం చెప్పింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నాయకులు రాజకీయాల్లో పోటీ చేయకుండా జీవిత కాల నిషేధం విధించాలని అశ్వినీ ఉపాధ్యాయ అనే అడ్వకేట్ సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై స్పందిస్తూ.. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. చట్ట సభలు చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా లేవని న్యాయస్థానాలు భావిస్తే రద్దు చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది తప్ప చట్టాలు ఎలా చేయాలో, చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయాలో పార్లమెంట్కు చెప్పే అధికారం కోర్టులకు లేదని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం.