హాస్టళ్ల బాధ్యత అదనపు కలెక్టర్లకు.. బాలికల గురుకులాల్లో మహిళా అధికారులు నిద్ర చేయాలి

హాస్టళ్ల బాధ్యత అదనపు కలెక్టర్లకు.. బాలికల గురుకులాల్లో మహిళా అధికారులు నిద్ర చేయాలి
  • సమస్యలపై రిపోర్ట్ అందజేయాలి..రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హాస్టళ్లు, స్కూళ్ల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఆలిండియా సర్వీస్ మహిళా అధికారులు బాలికల గురుకులాలను ప్రత్యేకంగా సందర్శించాలని ఆదేశించింది. రాత్రి అక్కడే పడుకుని.. స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించింది. వీటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు అందజేయాలని స్పష్టం చేసింది. మధ్యాహ్న భోజనం టైమ్​లో సడెన్ విజిట్లు చేపట్టాలని తెలిపింది. ప్రతి నెలా కలెక్టర్లు రివ్యూ చేయాలని సూచించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి వేర్వేరుగా రెండు జీవోలు జారీ చేశారు.ఫుడ్ పాయిజన్ ఘటనలు, మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, ఇతర సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు నివేదించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

రికమండేషన్స్ రూపంలో నివేదిక

ఆలిండియా సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మహిళా అధికారులు బాలికల గురుకులాల్లో రాత్రి బస చేసి సమస్యలు తెలుసుకోవాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. స్టూడెంట్లు, టీచర్లు, స్టాఫ్​తో మాట్లాడి ఇన్​స్టిట్యూషన్ మొత్తం రివ్యూ చేయాలని సూచించారు. సౌలత్​లు, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్ వంటి అంశాలపై సమీక్ష చేయాలని తెలిపారు. అక్కడి సమస్యలు.. పరిష్కార చర్యలపై నివేదిక సిద్ధం చేసి సంబంధిత ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు రికమండేషన్స్ రూపంలో సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఎస్సీ డెవలప్​మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని నోడల్ ఆఫీసర్​గా నియమించారు.

రిమోట్ ఏరియాలపై ప్రత్యేక శ్రద్ధ

అన్ని గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లను మానిటరింగ్ చేయాలని అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. రెగ్యులర్ పర్యవేక్షణతో పాటు ఇన్​ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూంలు, హాస్టల్స్, శానిటైజేషన్ ఫెసిలిటీస్, డైనింగ్ అరెంజ్​మెంట్స్, ఫుడ్ ఐటెమ్స్, డైట్ ప్లాన్, మధ్యాహ్న భోజన టైమ్​లో సడెన్ విజిట్లు ఉండాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారైనా అదనపు కలెక్టర్లు గురుకులాల్లో నిద్ర చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో ఉన్న గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. స్టూడెంట్లు, పేరెంట్స్, స్టాఫ్ కోసం గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అన్ని శాఖలతో అదనపు కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ల ఇచ్చిన నివేదికపై నెలకోసారి కలెక్టర్లు రివ్యూ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.