తెలుగులో జీవోలు ! రుణమాఫీ, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జీవోలు మాతృభాషలోనే

  • ప్రధాన ఉత్తర్వులన్నీ తెలుగులో ఇస్తున్న సర్కార్
  • భవిష్యత్ లోనూ ఉత్తర్వులన్నీ తెలుగులో ఇచ్చేలా ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఇన్నాళ్లూ ప్రభుత్వ జీవోలన్నీ ఇంగ్లిష్​లోనే వచ్చేవి. కానీ, ఇటీవల సామాన్యులకు అర్థమయ్యేలా పలు జీవోలను సర్కారు తెలుగులో ఇస్తోంది. గతేడాది రుణమాఫీ జీవోను రాష్ట్ర ప్రభుత్వం తెలుగులో ఇచ్చింది.  దీనిపై తెలుగు భాషాభిమానులతో పాటు సామాన్యుల్లో హర్షం వ్యక్తమైంది. 

అప్పటి నుంచి ప్రజలకి నేరుగా సంబంధం ఉన్న జీవోలన్నింటిని ఆయా శాఖలు తెలుగులోనే  ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ నుంచి ఇటీవల రైతు భరోసా అమలు మార్గదర్శకాల జీవో కూడా తెలుగులోనే వచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇచ్చిన ఉత్తర్వులు కూడా తెలుగులో స్పష్టంగా ఉన్నాయి.  ఇతర శాఖల్లోనూ ముఖ్యమైన జీవోలను దశల వారీగా  తెలుగులోనే ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, నిబంధనలు, సూచనలు ప్రజలకు తేలికగా అర్థమయ్యేందుకు ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని శాఖలను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో.తమిళనాడును అనుకరించాలని సూచించారు. 

ఆ జీవోకు 44 ఏండ్లు..  

ప్రభుత్వ జీవోలు తెలుగులోనే ఇవ్వాలంటూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం1980లోనే ఓ జీవో ఇచ్చింది. కొన్నిశాఖల్లో కొంతకాలం అమలు చేసినప్పటికీ తర్వాత ఎందుకనో పక్కనపెట్టేశారు. ఫలితంగా ఇన్నేండ్లలో ఒకటి, అరా మినహా అన్ని  జీవోలు ఇంగ్లిష్​లోనే వచ్చాయి. దీంతో ఈ జీవోలను అర్థం చేసుకోవడం సామాన్యులకు కష్టసాధ్యమయ్యేది. ఇలాంటి జీవోలను  ప్రజాప్రతినిధులు సైతం సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బందులపాలైన సందర్భాలు ఉన్నాయి. 

ఈ క్రమంలో  ప్రభుత్వ జీవోలన్నీ తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలుగు, మాతృభాషా దినోత్సవాల సందర్భంగా గత ప్రభుత్వ పెద్దలు చెప్పారే తప్ప అమలుచేయలేదు. కానీ కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఈ దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  తమ ప్రజాప్రభుత్వంలో  జీవోల విషయంలో పూర్తి పారదర్శకత పాటిస్తామని, పబ్లిక్​డొమైన్​లో పెడ్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నది.  

ప్రతి ఒక్కరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ముఖ్యమైన జీవోలను తెలుగులో ఇస్తున్నది. ఇటీవల రైతుభరోసా, రేషన్​కార్డుల మార్గదర్శకాలపై ఇచ్చిన జీవోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ జీవోలను తెలుగులోకి అనువాదించే బాధ్యతలను ‘డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు ప్రభుత్వం అప్పగించినట్లు తెలిసింది.