ఓరుగల్లులో కనుమరుగవుతున్న కాకతీయ శిల్ప సంపద

వరంగల్‍, హనుమకొండ, వెలుగు: ‘కాకతీయ వైభవ సప్తాహం’ పేరుతో ఓరుగల్లులో  వారం పాటు వేడుకలు నిర్వహించేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. 700 ఏండ్ల తర్వాత కాకతీయ వంశస్థులను చత్తీస్​గఢ్​నుంచి రావాలని ఆహ్వానించారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాకతీయుల వైభవానికి సాక్ష్యంగా ఉన్న కట్టడాలను మాత్రం సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఓ వైపు ఓరుగల్లు కోట వరద నీటిలో నానుతోంటే, మట్టికోట రోజురోజుకూ ధ్వంసమై తుమ్మ చెట్లతో జంగల్‍ను తలపిస్తోంది. ఇక వారసత్వ సంపదగా వచ్చిన గుళ్లు, గోపురాలు నిర్వహణ లేక శిథిలమవుతున్నాయి. వెయ్యి స్తంభాల గుడి కల్యాణ మండపం పిల్లర్లు దశాబ్దన్నర కాలంగా ముళ్లపొదల్లోనే మగ్గుతున్నాయి. కాకతీయులు తవ్వించిన బావులను భవిష్యత్‍ తరాలకు తెలిసేలా పరిరక్షిస్తామన్న హామీ నెరవేరలేదు. దీంతో కట్టడాలను పరిరక్షించలేనప్పుడు ఉత్సవాలు జరిపి ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి.

వెయ్యి స్తంభాల గుడి కల్యాణ మండపాన్ని రెండేండ్లలో పునరుద్దరిస్తామని 2006లో అప్పటి నాయకులు హామీ ఇచ్చారు. ఇందుకోసం మండపం పిల్లర్లు, శిల్పాలను విప్పారు. వాటిని పద్మాక్షి టెంపుల్‍ దగ్గర్లోని శ్మశానవాటిక వద్ద పడేశారు.16 ఏండ్లుగా శిల్పకళా సంపద ముళ్లపొదల్లోనే పడుంది. ప్రత్యేక రాష్ట్రంలోనూ పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు స్పీడప్ చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ ఆఫీసర్లు నిర్లక్ష్యం వీడడం లేదు.

హైదరాబాద్‍ బన్సీలాల్‍పేటలో 17వ శతాబ్దం నాటి మెట్ల బావిని అక్కడి లీడర్లు మళ్లీ బయటి ప్రపంచానికి చూపారు. ‘మన్‍ కీ బాత్‍’లోనూ ప్రధాని ఆ బావిని ప్రస్తావించారు. కాగా, 11వ శతాబ్దంలో ఖిలా వరంగల్ చుట్టూరా కాకతీయులు తవ్వించిన వందలాది బావులు అంధకారంలో మగ్గుతున్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం, లోకల్ లీడర్లు ఏనాడు పట్టించుకోలేదు. దాదాపు 365  బావుల్లో చాలావరకు కనుమరుగయ్యాయి. అంతేకాక సిటీలో 800 ఏళ్ల నాటి శివనగర్ మెట్ల బావి, గడియారం బావి, అక్కాచెల్లెళ్ల బావి, ఈసన్న  బావి, సవతుల బావి, జంగమయ్య  బావి, కొత్తవాడ గోపాలస్వామి మెట్ల బావి, శృంగార  బావి,  పీరీళ్ల బావి,  కరీమాబాద్‍ మెట్ల బావితో పాటు మరెన్నో ఉన్నా.. అవి రిపేర్లకు నోచుకోవడం లేదు.

ఖిలా వరంగల్ కోట నిర్వహణ గాడి తప్పింది. తూర్పు, మధ్య, పడమర కోటల్లోని గుళ్లను పట్టించుకోకపోవడంతో కళతప్పాయి. కొన్ని కట్టడాలను బర్ల కొట్టాలుగా మార్చారు.కోటలో ఎటు చూసినా మందు, బీర్‍ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. కట్టడాలకు దగ్గర్లోనే డంపింగ్‍ యార్డ్ పెట్టారు. గుళ్లు, కట్టడాల్లోని చాలా విగ్రహాలను ఆకతాయిలు ధ్వంసం చేశారు.  ఖిల్లా చుట్టూరా ఎటువంటి నిర్మాణాలు చేయొద్దనే రూల్‍ ఉన్నా హోటళ్లు, దాబాల పేరుతో షాపులు వెలుస్తున్నాయి.  కార్పొరేషన్ వద్దనున్న మ్యూజియాన్ని ఖిలా వరంగల్ కు తరలిస్తామన్న ఆఫీసర్లు.. దానిని మరిచారు. అలాగే రూ.21 లక్షలతో స్టేడియం డెవలప్‍ చేస్తామన్న హామీ కూడా అటకెక్కింది. 

కేంద్ర ప్రభుత్వం ఓరుగల్లు చారిత్రక కట్టడాల సంరక్షణకు హృదయ్‍ స్కీంలో  రూ.8.9  కోట్లు కేటాయించింది. రూ.6 కోట్లతో  ఫోర్ట్ కట్టడాలు జిగేల్​మనేలా ఫసాడ్ లైట్లు పెట్టాలని భావించారు. 2015 అక్టోబర్‍18న అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు పనులకు శంకుస్థాపన చేశారు. దేశంలోని అన్ని టూరిజం కట్టడాల వద్ద యూనివర్సల్‍ లైటింగ్‍ ఉండాల్సి ఉండగా.. ఇక్కడ పనులు ప్రారంభించిన ‘కుడా’ ఇష్టారీతిన రూల్స్ ఫాలో కాకపోవడంతో ఫండ్స్ రిజెక్ట్ అయ్యాయి. అలాగే ఈ స్కీం కింద కోట అభివృద్ధికి కేంద్రం రూ.42 కోట్లు కేటాయించినా.. ఇక్కడి ఆఫీసర్లు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు.

వారసత్వ సంపద కాపాడటంలో లీడర్లు ఫెయిల్‍

వందల ఏండ్ల నాటి వారసత్వ సంపదను కాపాడుకోవడంలో లోకల్ లీడర్లు ఫెయిల్ అవుతున్నారు. టూరిస్టులు ఊహించుకున్న స్థాయిలో కట్టడాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దకపోవడం పట్ల ఇక్కడి జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లు చరిత్రను వక్రీకరించేలా నిర్మాణాలు చేస్తున్నారు. హైదరాబాద్‍, వరంగల్‍ మార్గంలో రాంపూర్‍ హైవే వద్ద కాకతీయుల కళాతోరణాన్ని రెండు ముక్కలుగా విడగొట్టి రోడ్డుకు అటో ముక్క ఇటో ముక్క పెట్టడం విమర్శలకు దారితీసింది. కాకతీయుల ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. అదే కాకతీయుల కట్టడాల పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జనాలు కోరుతున్నారు. 

కాకతీయుల వారసత్వ సంపదను కాపాడాలే

ఎక్కడలేని శిల్ప సంపద మన వరంగల్​లో ఉంది. అరుదైన కట్టడాలు, శిల్పాలు, తోరణాలు, బావులు, చెరువులు..ఇలా ప్రతి ఒక్కటి కాకతీయులు మనకిచ్చిన వారసత్వ సంపద. వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. బాహ్య ప్రపంచానికి చూపేలా  తీర్చిదిద్దాలి. కట్టడాల్లో ఆకతాయిల ఆగడాలను కట్టడి చేయాలి. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. హైదరాబాద్​ లో మాదిరిగా ఇక్కడ కూడా బావులను పునరుద్దరించాలి. తద్వారా టూరిజానికి  అభివృద్ధి చెందుతుంది. 
– అరవింద్‍ ఆర్య పకిడే ( టార్చ్ జనరల్‍ సెక్రటరీ)