సిరిసిల్లలో సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల్లో వెంచర్​.. 20.87ఎకరాల్లో లేఅవుట్ చేస్తున్న బల్దియా

  • వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తుది దశకు రోడ్లు, డ్రైన్ల నిర్మాణం
  • ప్రత్యక్ష వేలం ద్వారా అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సర్కార్​భూముల్లో వెంచర్​వేసి అమ్మేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. సుమారు 20.87 ఎకరాల్లో లేఅవుట్​చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనులు జరుగుతున్నాయి. ప్రత్యక్ష వేలం ద్వారా అమ్మేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. బల్దియా ఆదాయం కోసమే వెంచర్​ చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.

20.87ఎకరాల్లో వెంచర్

సిరిసిల్ల మున్సిపల్ ఆదాయం కోసం సర్వే నంబర్ 405 లో  20.87 ఎకరాల్లో మొదటి వెంచర్ సిద్ధం చేసింది. టీఎస్ఐఐసీ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 4 నెలలుగా వెంచర్​అభివృద్ధి చేస్తున్నారు. పెద్దూరు శివారులోని వెంకటాపూర్-–రగుడు బై పాస్‌‌‌‌‌‌‌‌లో మోడల్ లే అవుట్‌‌‌‌‌‌‌‌ చేసి డ్రైన్, రోడ్లు, స్ట్రీట్​లైట్స్, తాగునీటి సప్లై, ఇతర మౌలిక వసతుల కోసం రూ.8కోట్లు ఖర్చుపెట్టేందుకు పాలకవర్గం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే రోడ్లు, డ్రైన్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే వేలం నిర్వహించేందుకు పట్టణ ప్రజలకు అవగాహన మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. 

ALSO READ : తెరపైకి బీసీ నినాదం.. 53 శాతం మంది బీసీ ఓటర్లే

విలువైన భూములకు వేలం

సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగేండ్ల కింద ఏడు గ్రామాలను విలీనం చేశారు. ఇందులో జెగ్గరావుపల్లి, పెద్దూర్ ఉన్నాయి. కాగా ఈ గ్రామాల్లో పెద్దమొత్తంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి.  జెగ్గారావుపల్లిలో 300ఎకరాలుండగా ఇందులో 200 ఎకరాలు 17వ బెటాలియన్ కేటాయించారు. ఇక్కడే ఇంజినీరింగ్ కాలేజ్ నిర్మించేందుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. పెద్దూర్ శివారులో 400 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా ఇక్కడ ఇప్పటికే మెడికల్ కాలేజ్, డబుల్ బెడ్రూం ఇండ్లు, హరిత హోటల్, వర్కర్ టూ ఓనర్ పథకంలో భాగంగా షెడ్లు, కేజీబీవీ నిర్మించారు.  

బైపాస్​ రావడంతో ఫుల్ ​డిమాండ్​

వెంకటాపూర్ నుంచి కలెక్టరేట్ వరకు బైపాస్ నిర్మించడంతో ఇక్కడి భూములకు డిమాండ్ ​పెరిగింది దీంతో146 గజాల నుంచి 288 గజాలు ఉండేలా ప్లాట్లను ఏర్పాటు చేశారు. గజానికి  రూ.5వేల నుంచి రూ.6 వేల వరకు పలుకుతోంది. ఈ ప్లాట్లను అమ్మితే మున్సిపాలిటీకి రూ. 20 కోట్ల ఆదాయం సమకూరనుంది. దీంతో ప్రత్యక్ష వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించారు. ఇలా ఆదాయం కోసం ప్రభుత్వమే వెంచర్ ఏర్పాటు చేసి వేలం ద్వారా భూములు అమ్మడం మున్సిపాలిటీల్లో సిరిసిల్లలోనే మొదటిసారి కావడం గమనార్హం. 

భగ్గుమంటున్న ప్రతిపక్షాలు

రూ.కోట్ల విలువ చేసే సర్కార్ ​భూములను వేలం వేయడంపై సిరిసిల్లలోని ప్రతిపక్ష లీడర్లు భగ్గుమంటున్నారు. పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా ఇలా వేలం వేయడం అన్యాయమని వాపోతున్నారు. 

పట్టణాభివృద్ధికి కేటాయిస్తాం

 ప్రభుత్వ భూమిలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మధ్య చాలా పట్టణాల్లో మున్సిపల్ పరిధిలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పట్టణాభివృద్ధికి కేటాయిస్తాం. బహిరంగ వేలానికి త్వరలోనే తేదీలను ప్రకటిస్తాం. 

ఎండీ ఆయాజ్, కమిషనర్, సిరిసిల్ల మున్సిపాలిటీ