‘వీ6’ కథనాలకు స్పందన.. రైతుల సమస్యకు పరిష్కారం

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి,  నానక్ నగర్, తాటిపర్తి,  కుర్మిద్ద గ్రామాల్లో ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం 19,333 ఎకరాల పట్టా, అసైన్డ్ భూములను రైతుల నుంచి సేకరిస్తోంది. అయితే ఫార్మాసిటీకి ఇవ్వని రైతుల భూములను సైతం ‘ధరణి’ పోర్టల్ భూ రికార్డుల్లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్ఐఐసీ) పేరిట నమోదు చేశారు. దీంతో  రైతులు గత రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వారు పడుతున్న బాధలను ‘వీ6 న్యూస్’, ‘వీ6 వెలుగు’ ప్రత్యేక కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చాయి. దీంతో సంబంధిత అధికారులు స్పందించారు. బాధిత రైతుల భూరికార్డుల నుంచి టీఎస్ఐఐసీ పేరును తొలగించి, ఆయా రైతుల పేర్లను నమోదు చేశారు. దీంతో బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘వీ6 న్యూస్’, ‘వీ6 వెలుగు’కు ధన్యవాదాలు తెలిపారు.