
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో కీలక పరిణామాలు శరవేగంగా జరిగిపోతున్నాయి. జాతీయ భద్రతా సలహా మండలిలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. RAW (Research and Analysis Wing) మాజీ చీఫ్ అలోక్ జోషీని జాతీయ భద్రతా సలహా మండలి హెడ్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
అంతేకాదు.. ఈ మండలిలో సభ్యులుగా మాజీ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పి.ఎం.సిన్హా, మాజీ సౌత్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, మాంటీ ఖన్నా, రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, బి వెంకటేశ్ వర్మను కేంద్రం నియమించింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీతో(CCS) సమావేశం జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా యుద్ధంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్ఎస్ఏబీ ప్రభుత్వం వెలుపల ఉన్న ప్రముఖ వ్యక్తులతో కూడిన బహుళ క్రమ శిక్షణా సంస్థగా ఉంటుంది.