ఇకపై సీలింగ్ ఫ్యాన్లకు BIS మార్క్ తప్పనిసరి

ఇకపై సీలింగ్ ఫ్యాన్లకు BIS మార్క్ తప్పనిసరి

ఎలక్ట్రిక్ వస్తువుల నాణ్యతపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.నాణ్యత లేని విదేశీ వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశీయ విద్యుత్ సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తిని పెంచేందుకు నాణ్యత నిబంధనలు జారీ చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) ఆగస్టు 9న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై అన్ని రకాల ఫ్యాన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (BIS) గుర్తును కలిగి ఉండాలని నిబంధనలు తెచ్చింది.  సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తి, స్టాక్,దిగుమతి, విక్రయించాలంటే ఈ గుర్తు తప్పనిసరి. 

 ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లకు BIS ధృవీకరణ నియమాలు వర్తించలేదు. BIS చట్టం నిబంధనను ఉల్లంఘిస్తే మొదటి నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.రెండోసారి చట్ట ఉల్లంఘన చేస్తే జరిమానా కనీసం రూ. 5 లక్షలు, వస్తువుల విలువ కంటే 10 రెట్లు వరకు పొడిగించబడుతుందని డిపీఐఐటీ తెలిపింది. 

నోటిఫికేషన్ ప్రకారం దేశీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు మద్దతు ఇచ్చేందుకు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) అమలు కోసం క్రమంగా సడలింపులు చేయబడ్డాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తేది నుంచి ఆరు నెలల నెలల తర్వాత అమల్లోకి వస్తుందని డీపీఐఐటీ పేర్కొంది. నాణ్యతను  అభివృద్ధి చేయడానికి QCO అభివృద్ధితో సహా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు డిపిఐఐటి తెలిపింది.