మరో 60 గ్రూప్ 1 పోస్టులు.. భర్తీకి ప్రభుత్వం అనుమతి

మరో 60 గ్రూప్ 1 పోస్టులు.. భర్తీకి ప్రభుత్వం అనుమతి
  •     ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
  •     టీఎస్​పీఎస్సీ ద్వారా నియామకాలు
  •     563కు చేరిన మొత్తం పోస్టులు
  •     కొత్తదా లేక సప్లిమెంటరీ నోటిఫికేషనా.. ఇంకా రాని స్పష్టత 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1లో అదనంగా మరో 60 పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నది. పలు శాఖల్లో నోటిఫై చేసిన పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు జీవో నంబర్ 16 రిలీజ్ చేశారు. అయితే, ఇప్పటికే గ్రూప్ 1 ద్వారా 503 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను ప్రభుత్వం సేకరించింది.

దీంట్లో మొత్తంగా 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది. వీటిని టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. డిపార్ట్ మెంట్ల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, క్వాలిఫికేషన్ల తదితర వివరాలను ఆయా శాఖలు టీఎస్​పీఎస్సీకి అందించాలని సర్కారు ఆదేశించింది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు జీవోలో పేర్కొంది. హోమ్ డిపార్ట్ మెంట్ పరిధిలోని 27, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ లో 21, రెవెన్యూ డిపార్ట్​మెంట్లో 8, కార్మికశాఖ పరిధిలో మూడు, ఫైనాన్స్ శాఖలో ఒక పోస్టు భర్తీ చేయనున్నారు. అయితే, రెండుసార్లు గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, ఒకసారి పేపర్ లీకేజీతో.. మరోసారి బయోమెట్రిక్, ఇతర నిబంధనలు పాటించకపోవడంతో రద్దు అయ్యింది. కాగా, ప్రస్తుతం గ్రూప్1 పరీక్షపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నది.

రద్దు చేస్తరా.. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తరా.? 

గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై టీఎస్​పీఎస్సీలో స్పష్టత రాలేదు. పాత నోటిఫికేషన్ రద్దు చేయాలా? లేక, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్​కు కొత్త పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా? అనే దానిపై టీఎస్పీఎస్సీ అధికారులు చర్చిస్తున్నారు. రీ నోటిఫికేషన్ ఇస్తే 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే కేవలం 60 పోస్టులతోనే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలి.

ALSO READ: గృహజ్యోతికి డేటా సేకరణ షురూ

అయితే, ఈ రెండు విధానాల్లో ఏ పద్ధతి పాటించాలనే దానిపై సర్కారుకూ టీఎస్​పీఎస్సీ ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది. మరోపక్క న్యాయనిపుణుల సలహాను తీసుకుంటున్నది. అయితే, గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్ కు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయనే వాదనలూ ఉన్నాయి. కొత్త సర్కారు.. కొత్త కమిషన్ హయాంలో మళ్లీ గ్రూప్1 నోటిఫికేషన్ ఇవ్వాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.

గ్రూప్ 1 పోస్టుల వివరాలు        పోస్టు పేరు    సంఖ్య
డీఎస్పీ                                                     24 
ఎంపీడీఓ                                                  19 
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్    4 
డిప్యూటీ కలెక్టర్                                             3 
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్    3 
జిల్లా ఎంప్లాయ్​మెంట్ ఆఫీసర్                    3 
జిల్లా పంచాయతీ ఆఫీసర్                            2 
జిల్లా రిజిస్ట్రార్                                                 1 
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్                            1 
మొత్తం                                                            60