- అడ్మినిస్ట్రేటివ్ విధానంలోనే కేటాయింపులు
- రిలయన్స్‌ను మస్క్ విమర్శించిన కొన్ని గంటల్లోనే క్లారిటీ
- సపోర్ట్ చేసిన ఎయిర్‌టెల్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ను వేలం వేయమని, అడ్మినిస్ట్రేటివ్ విధానాంలోనే (డైరెక్ట్‌గా కంపెనీలకు అమ్మడం) కేటాయింపులు ఉంటాయని తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వేలం అవసరమని డిమాండ్ చేయగా, దీన్ని స్టార్‌లింక్ బాస్ ఎలన్ మస్క్ విమర్శించిన విషయం తెలిసిందే. ‘శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ను షేర్డ్ స్పెక్ట్రమ్ (పంచుకోవడానికి వీలుండే) గా ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) వర్గీకరించింది. దీన్ని సమర్ధవంతగా, ఎకనామికల్‌గా మేనేజ్ చేయాలి’ అని ఎలన్ మస్క్ తాజాగా స్పందించారు.
ఆయన విమర్శించిన కొన్ని గంటల తర్వాత శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులపై టెలికం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా క్లారిటీ ఇచ్చారు. ఆక్షన్‌కు వెళితే, మిగిలిన ప్రపంచానికి భిన్నంగా చేసినట్టు అవుతుందని అన్నారు. ఇండియా చట్టాలకు అనుగుణంగా అడ్మినిస్ట్రేటివ్ విధానంలో కేటాయింపులు ఉంటాయని, ట్రాయ్ ధరలను నిర్ణయిస్తుందని వివరించారు. అన్ని కంపెనీలకు సమాన అవకాశాలు ఇవ్వాలంటే శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొంత కాలంగా డిమాండ్ చేస్తోంది. కానీ, మస్క్ స్టార్‌లింక్, ఎయిర్‌టెల్ మాత్రం అడ్మినిస్ట్రేటివ్ విధానంలో లైసెన్స్‌లు ఇవ్వడం గ్లోబల్ ట్రెండ్ అని గుర్తు చేస్తున్నారు. అమెజాన్ కైపెర్ కూడా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపునకే మొగ్గు చూపుతోంది.
మొబైల్, శాటిలైట్ ఆపరేటర్లు కలిసి పనిచేయాలి: ఎయిర్‌టెల్
పాయింట్ టూ పాయింట్ మధ్య జరిగే శాటిలైట్ సర్వీస్‌లకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ విధానంలో ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తోంది. ఈ విధానంతో పాటు లాటరీ, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, వేలం విధానాల్లో కూడా స్పెక్ట్రమ్‌ను అమ్ముతోంది. రూరల్ ఏరియాల్లో టెలికం సర్వీస్‌లు విస్తరించాలంటే అడ్మినిస్ట్రేటివ్ విధానాన్ని శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ అమ్మకంలో వాడాలని ఎయిర్‌టెల్ ప్రభుత్వాన్ని కోరింది. ఇండియాలోని మారుమూల ప్రాంతాలకు టెలికం సర్వీస్‌లు అందివ్వడానికి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌తో వీలుంటుందని ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. మారిటైమ్, ఏవియేషన్, డిఫెన్స్, డిజాస్టర్ రికవరీ పనుల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్‌లను ఇప్పటికే వాడుతున్నామని అన్నారు.
వన్‌వెబ్‌తో ఎయిర్‌టెల్‌కున్న పార్టనర్‌షిప్‌ను కూడా ప్రస్తావించారు. వన్‌వెబ్‌కు లో–ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈఓ) శాటిలైట్లు ఉన్నాయి. ఇవి ఆఫ్రికా, ఇండియాలో సర్వీస్‌లను అందివ్వగలవు. కంపెనీ ఇప్పటికే గుజరాత్, తమిళనాడులో రెండు గ్రౌండ్ స్టేషన్లను కూడా నిర్మించింది. శాటిలైట్ ఆపరేటర్లు కూడా టెలికం ఆపరేటర్ల మాదిరే లైసెన్స్ తీసుకోవాలని, స్పెక్ట్రమ్ కొనాలని, ఇతర రూల్స్‌ను ఫాలో కావాలని, ట్యాక్స్‌లు, ఫీజులు చెల్లించాలని ఎయిర్‌టెల్ తన స్టేట్‌మెంట్‌లో వివరించింది. మొబైల్ ఆపరేటర్లు, శాటిలైట్ ఆపరేటర్లు కలిసి మారుమూల ప్రాంతాలకు సర్వీస్‌లను అందివ్వొచ్చని అభిప్రాయపడింది. కాగా, రిలయన్స్ కూడా జియోస్పేస్‌ఫైబర్ కింద ఈ సర్వీస్‌లను అందిస్తోంది.