- నడిగడ్డలో మన ఊరు-మనబడి పనులు వెరీ స్లో
- 161 స్కూళ్లలో, 11 చోట్ల మాత్రమే పనులు కంప్లీట్
- సౌలతులు లేక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్
- ఎమ్మెల్యే సొంత ఊరిలో ఏడాదిన్నరగా స్కూల్ బిల్డింగ్ పనులు పెండింగ్
గద్వాల, వెలుగు : స్కూళ్ల ఓపెనింగ్ కు ముందే అన్ని సౌలతులు కల్పిస్తామంటూ సర్కారు, మన ఊరు మనబడి పథకాన్ని తీసుకొచ్చింది. నిధుల కొరతతో జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ పథకం కింద పనులు జరగలేదు. 161 స్కూళ్లలో పనులు చేయాలని నిర్ణయించి అడిషనల్ రూమ్స్, డైనింగ్ హాల్స్, టాయిలెట్స్, కరెంట్ వర్క్స్ చేసేందుకు రూ.43.29 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ పనులను స్కూల్స్ ఓపెనింగ్ కంటే ముందే కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే 11 చోట్ల మాత్రమే పనులు కంప్లీట్ అయ్యాయి. ఎమ్మెల్యే సొంత విలేజ్, ఆయన భార్య బండ్ల జ్యోతి సర్పంచ్ గా ఉన్న ధరూర్ మండలం బురెడ్డిపల్లిలో ఏడాదిన్నరగా స్కూల్ వర్క్స్ పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో స్కూళ్లలో సౌలతులు లేక స్టూడెంట్స్ తిప్పలు పడుతున్నారు.
ఎమ్మెల్యే స్వగ్రామంలోనే పెండింగ్..
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సొంత ఊరు, ఆయన భార్య బండ్ల జ్యోతి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ధరూర్ మండలం బురెడ్డిపల్లె గ్రామంలోని స్కూల్ పనులు ఏడాదిన్నరగా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈడబ్ల్యూ ఐడీసీ స్కీం కింద రూ.40 లక్షలతో స్కూల్ బిల్డింగ్ నిర్మాణాన్ని ఏడాదిన్నర కింద ప్రారంభించారు. పనులు కంప్లీట్ కాకపోవడంతో ప్రైవేట్ బిల్డింగ్ లో సౌలతులు లేక స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. వర్క్స్ కంప్లీట్ కావాలంటే ఇంకా రూ.20 లక్షలు అవసరమని, ఫండ్స్ లేకపోవడంతోనే పనులు నిలిచిపోయాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
అలాగే బురెడ్డిపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నారెడ్డిపల్లె విలేజ్ లో వర్క్స్ మధ్యలోనే ఆగిపోయాయి. రూ.10 లక్షల ఫండ్స్ కావాలి. నిధుల కొరతతో పనులు ఇప్పట్లో కంప్లీట్ అయ్యేలా కనిపించడం లేదు. 150 స్కూళ్లలో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఎస్ఎంసీ కమిటీ, సర్పంచులు వర్క్స్ చేసేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు.
సౌలతులు లేక తిప్పలు..
జిల్లాలో చాలా స్కూళ్లలో సౌలతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని స్కూళ్లలో టాయిలెట్స్ లేకపోవడంతో విద్యార్థినులు, మహిళా టీచర్లు అవస్థలు పడాల్సి వస్తోంది. కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు తండా స్కూల్లో ఫ్లోరింగ్ సరిగా లేకపోవడంతో స్టూడెంట్స్ ఇసుకపై కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది.
రెండు నెలల్లో కంప్లీట్ చేస్తాం..
మనబడి పనులు రెండు నెలల్లో కంప్లీట్ చేస్తాం. గతంలో చేసిన పనులకు బిల్లులు ఆలస్యంగా వచ్చాయి. నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే. త్వరలోనే పనులు కంప్లీట్ చేసేలా చూస్తాం.
- ఆంజనేయులు, పీఆర్ ఈఈ