- ఆర్ఐసీ సెస్ కూడా తొలగింపు
- రాజ్యసభలో నోటిఫికేషన్
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడిచమురు, జెట్ ఇంధనం (ఏటీఎఫ్), డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం సోమవారం రద్దు చేసింది. 2022 జులైలో విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ చమురు ధరలలో తగ్గుదల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే ముడి చమురు ఎగుమతులపై విధించే లెవీని రద్దు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో నోటిఫికేషన్‌ను ప్రవేశపెట్టారు.
ముడి చమురు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్), డీజిల్, పెట్రోల్ ఎగుమతిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) లెవీని ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. దీనితో పాటు, పెట్రోల్ డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న రహదారి మౌలిక సదుపాయాల సెస్‌ను (ఆర్ఐసీ) కూడా తొలగించారు. 2022లో లీటరుకు రూ. 6 (బ్యారెల్‌కు12 డాలర్లు) చొప్పున, పెట్రోల్, ఏటీఎఫ్ డీజిల్‌పై రూ. 13 (బ్యారెల్‌కు 26 డాలర్లు) చొప్పున ఎగుమతి సుంకం విధించారు.
దేశీయ ముడి ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250 (బ్యారెల్‌కు 40 డాలర్లు) విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ వేశారు. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పన్ను రేట్లను సమీక్షిస్తారు. అయితే నోటిఫికేషన్వచ్చిన 15 రోజులకే పెట్రోల్ ఎగుమతిపై లెవీని తొలగించారు. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై పన్నును గత ఏప్రిల్‌లో తొలగించినా, అదే సంవత్సరం ఆగస్టులో తిరిగి వేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఏటీఎఫ్, డీజిల్ ఎగుమతులపై లెవీ విధించడం లేదు. ముడి చమురు ధరలపై లెవీ ప్రతి 15 రోజులకు ఒకసారి మారుతుంది. ఇది ఆగస్టు 31, 2024లో టన్నుకు రూ. 1,850గా ఉండగా, తదనంతరం సున్నాకు చేరింది. ఇప్పుడు, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు, ఇంధన ఎగుమతులపై సుంకాలు రద్దయ్యాయి.
ప్రభుత్వానికి భారీ ఆదాయం..
ప్రభుత్వం లెవీ అమలు చేసిన మొదటి సంవత్సరంలో దాదాపు రూ.25వేల కోట్లు, 2023-–24లో రూ.13వేల కోట్లు, ఈ ఏడాది రూ.ఆరు వేల కోట్లు రాబట్టింది. మనదేశం నుంచి రిలయన్స్, నయారా భారీగా చమురును ఎగుమతి చేస్తున్నాయి. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందితే విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో లెవీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మనదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు బ్యారెల్ ధర ప్రస్తుతం 73.02 డాలర్ల వరకు ఉంది.