- బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో సర్కారు పర్మిషన్!
- ఇప్పటికే 400 మందికి స్పౌజ్ ఆర్డర్లు
- జీవో 317కు విరుద్ధంగా ఇతర జిల్లాల వారికి బదిలీలు
హైదరాబాద్, వెలుగు: “ఆ జిల్లాల్లో పోస్టులు లేవు. కొత్తగా వేరే ఎవరైనా వస్తే కేడర్ స్ర్టెంత్ డిస్టర్బ్ అవుతుంది. నిరుద్యోగులకు భవిష్యత్‌లో ఇబ్బంది..” నిన్నటిదాకా స్పౌజ్ బదిలీల కోసం బ్లాక్ చేసిన జిల్లాల విషయంలో సర్కారు పెద్దలు చెప్పిన మాటలివి. కానీ ఇదంతా బయటికి చెప్పేందుకే. లోలోపల మాత్రం బ్లాక్ చేసిన జిల్లాల్లో టీచర్ల స్పౌజ్ బదిలీలు కానిచ్చేస్తున్నారు. ఈ తతంగమంతా సీఎస్, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆఫీసుల మధ్యనే జరుగుతున్నదనే ప్రచారం సాగుతోంది. చివరికి సంబంధిత మంత్రి, స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకూ సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. రెండు రోజుల కింద నేరుగా సెక్రటేరియట్ నుంచి 13 జిల్లాల కలెక్టర్లకు సుమారు 400 మందికి సంబంధించిన స్పౌజ్ ఆర్డర్లు వాట్సాప్ ద్వారా పంపించినట్లు సమాచారం. వీటిని కలెక్టర్లు సోమవారం సంబంధిత డీఈవోలకు పంపించగా, వారంతా అదేరోజు ఆ టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ తంతుకోసం భారీగా సొమ్ములు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి.
మంత్రికి కూడా తెలియకుండా..
ట్రాన్స్‌ఫర్లపై వచ్చిన టీచర్ల వివరాలను డీఈవోలు ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలి. కానీ వివరాలన్నీ ఫైనాన్స్ వారికి పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో డీఈవోలు పంపారని తెలిసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్లే వీటిని అప్లోడ్ చేసినట్టు సమాచారం. ఇంత గుట్టుగా ఎందుకు చేశారనే దానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు. సంబంధిత మినిస్టర్‌కూ విషయం తెలియకపోవడం గమనార్హం. ఈ విషయమై ఆరా తీసేందుకు సీఎస్‌కు మంత్రి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదని సమాచారం. ఏదైనా సమాచారమివ్వాల్సి వస్తేనే అధికారులు డీఈవోలకు కమ్యూనికేట్ ఫైల్ పెడతారు. అలాంటిది కేడర్ స్ర్టెంత్ మార్పు విషయంలో ఎలాంటి ఫైల్స్ వెళ్లకపోవడంపై అధికారుల్లోనూ అయోమయం నెలకొన్నది. గతంలో 19 జిల్లాల్లో జరిగిన స్పౌజ్ బదిలీల ద్వారా 876 మంది, ఆ తర్వాత రివర్స్ స్పౌజ్ ద్వారా మరో 50 మందిని బదిలీ చేశారు. ఈ వివరాలూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో లేవని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోనే స్పౌజ్ బదిలీలకు చాన్స్ ఉండగా, ఇతర జిల్లాల నుంచి కూడా ఈ కేటగిరీలో బదిలీ చేశారని, ఇది జీవో 317కు విరుద్ధమని టీచర్ల సంఘాల నేతలు చెబుతున్నారు.
ఈ బదిలీలు రద్దు చేయాలె
ఉమ్మడి జిల్లా పరిధి కాకుండా ఇతర జిల్లాల వారికి స్పౌజ్‌కు పర్మిషన్ ఎలా ఇస్తారు? ఇది రూల్స్‌కు విరుద్ధం. వీటిని రద్దు చేయాలి. దీనిపై ఇప్పటికే మంత్రికి ఫిర్యాదు చేశాం. సీఎస్‌తో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పారు.
- చెన్నయ్య, టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు