ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలో మార్పులు!

ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలో మార్పులు!

ప్రభుత్వ ఉద్యోగుల కోసం చేపట్టిన ‘ఎంప్లాయీస్‌‌ హెల్త్‌‌ స్కీం’లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకూ ఎంప్లాయీస్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌కు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించింది. అయితే ఈహెచ్‌‌ఎస్‌‌కు తమవంతు వాటాగా కొంత మొత్తం చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి. ఇదే అంశంపై టీఎన్‌‌జీఓ రాష్ట్ర  అధ్యక్షుడు కారం రవీందర్‌‌‌‌రెడ్డి మంగళవారం వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ శాంతి కుమారిని కలిశారు. ఈహెచ్‌‌ఎస్‌‌కు కంట్రిబ్యూట్‌‌ చేసేందుకు అంగీకరిస్తూ లేఖ ఇవ్వాలని రవీందర్‌‌‌‌ను ఆమె కోరారు. ఇది వరకే లేఖ ఇచ్చామని, మరోసారి ఇచ్చేందుకూ తాము సిద్ధమని రవీందర్‌‌‌‌ వివరించారు. ఉద్యోగుల వద్ద డబ్బులు తీసుకుంటే విమర్శల పాలవుతామని ఇన్నాళ్లు భావించిన ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగుల ప్రతిపాదనకు అంగీకరించే సూచనలు కనిపిస్తున్నాయి.

కేడర్‌‌‌‌ ఆధారంగా కంట్రిబ్యూషన్‌‌

తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఉచితంగా ట్రీట్‌‌మెంట్‌‌ అందించేందుకుఈహెచ్‌‌ఎస్‌‌ ప్రారంభించారు. ఉద్యోగులు, రిటైర్డ్‌‌ ఉద్యోగులకు హెల్త్‌‌ కార్డులిచ్చారు. ఈ కార్డులతో కార్పొరేట్‌‌, ప్రైవేటు హాస్పటల్స్‌‌లో  కొంతకాలం బాగానే వైద్య సేవలందాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవడంలో జాప్యం జరుగుతోందని కొంతకాలం తర్వాత కార్పొరేట్‌‌, ప్రైవేట్‌‌ ఆస్పత్రులు ఈహెచ్‌‌ఎస్‌‌ సేవలను నిలిపివేశాయి. ఇదే నేపథ్యంలో ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రభుత్వం వెల్‌‌నెస్‌‌ సెంటర్లు ప్రారంభించింది. ఇవి కూడా ఆశించిన మేర ఫలితాలివ్వలేదు. దీంతో ఈహెచ్‌‌ఎస్‌‌, వెల్‌‌నెస్‌‌ సెంటర్ల నిర్వహణపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. తమ వంతుగా కొంత మొత్తాన్ని ఇస్తే, ప్రభుత్వాన్ని నిలదీసే ఆస్కారం కూడా ఉంటుందన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది. రెండేండ్ల క్రితమే తమ ఆలోచనను ఉద్యోగులు ప్రభుత్వానికి తెలియజేశారు. ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పి, డబ్బులు తీసుకుంటే విమర్శలు వస్తాయని భావించిన ప్రభుత్వం.. ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చింది. అయితే, ప్రస్తుతం స్కీమ్‌‌ మొత్తమే నిర్వీర్యం అవుతుండడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఉద్యోగులే ముందుకొస్తుండడంతో విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశం ఉండదని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు, రిటైర్డ్‌‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య 15 నుంచి 20 లక్షల వరకూ ఉంటుందని అంచనా. కేడర్‌‌‌‌ను బట్టి నెలకు కొంత మొత్తాన్ని కంట్రిబ్యూట్‌‌ చేయాలన్న యోచనలో ఉన్నట్టు రవీందర్‌‌‌‌రెడ్డి తెలిపారు. ఉదాహరణకు అటెండర్ కేడర్‌‌‌‌ ఉన్నవారు నెలకు రూ.200, గ్రూప్‌‌ 4 ఉద్యోగులు రూ.300, ఎన్జీవోలు 500 ఇలా.. కేడర్‌‌‌‌ను బట్టి నెలకు కొంత ఈహెచ్‌‌ఎస్‌‌కు జమ చేయనున్నారు.  నెలకు రూ.300 కంట్రిబ్యూట్‌‌ చేసేందుకు రిటైర్డ్‌‌ ఎంప్లాయీస్‌‌ కూడా సిద్ధంగా ఉన్నారని రవీందర్‌‌‌‌రెడ్డి వివరించారు.