దేశవ్యాప్తంగా హైవేల అభివృద్ధికి రూ. 10 లక్షల కోట్లు.. వచ్చే రెండేండ్లలో ఖర్చు చేస్తం: నితిన్​ గడ్కరీ

దేశవ్యాప్తంగా హైవేల అభివృద్ధికి రూ. 10 లక్షల కోట్లు.. వచ్చే రెండేండ్లలో ఖర్చు చేస్తం: నితిన్​ గడ్కరీ
  • వచ్చే రెండేండ్లలో ఖర్చు చేస్తం: నితిన్​ గడ్కరీ
  • ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినం
  • అమెరికాకు దీటుగా రోడ్లను డెవలప్​ చేస్తామని వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోని హైవే రోడ్లను రాబోయే రెండేండ్లలో రూ. 10 లక్షల కోట్లతో అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కారు ప్లాన్​ చేస్తున్నదని రోడ్​ ట్రాన్స్​పోర్ట్, హైవే మినిస్టర్​ నితిన్​ గడ్కరీ వెల్లడించారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టామని, ఇక్కడ రోడ్లను అమెరికాలోని రహదారులకు దీటుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆదివారం నితిన్​ గడ్కరీ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

రాబోయే రెండేండ్లలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా దేశంలో మౌలిక సదుపాయాలు ఉండేలా కేంద్ర సర్కారు కృషిచేస్తున్నదని చెప్పారు. నార్త్​ఈస్ట్​ ప్రాంతంలో బోర్డర్లకు దగ్గరగా కఠినమైన భూభాగం ఉండడంతో ఇక్కడ మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, రాజస్థాన్, ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో పనులు జరుగుతున్నాయని వివరించారు. 

తూర్పు రాష్ట్రాల్లో 784 హైవే ప్రాజెక్టులు
తూర్పు రాష్ట్రాల్లో 21,355 కిలో మీటర్ల పొడవున రూ. 3,73,484 కోట్ల అంచనా వ్యయంతో 784 హైవే ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు గడ్కరీ తెలిపారు. ‘‘ప్రస్తుతం అస్సాంలో రూ. 57,696 కోట్ల విలువైన ప్రాజెక్టులు, బిహార్‌లో  రూ. 90 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో రూ. 42 వేల కోట్లు, జార్ఖండ్‌లో రూ. 53 వేల కోట్లు, ఒడిశాలో రూ. 58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపడుతున్నాం” అని వివరించారు.

అస్సాం మినహా  ఈశాన్యంలో ఈ ఏడాది దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. నాగ్‌పూర్‌లో రూ. 170 కోట్లతో సామూహిక వేగవంతమైన రవాణా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని తెలిపారు.

నేషనల్​హైవేల నెట్‌వర్క్ పొడవు గణనీయంగా విస్తరించిందని, 2014 మార్చిలో 91,287 కిలోమీటర్లు ఉండగా, ప్రస్తుతం 1,46,204 కిలోమీటర్లకు పెరిగిందని వివరించారు. రెండు లేన్ల కంటే తక్కువ ఉన్న జాతీయ రహదారుల నిష్పత్తి బాగా తగ్గిందని, మొత్తం నెట్‌వర్క్‌లో 30 శాతం నుంచి కేవలం 9 శాతానికి పరిమితమైందని చెప్పారు. 2024-25లో నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) లక్ష్యానికి మించి 5,614 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించిందని వెల్లడించారు.