ఎల్ఆర్ఎస్​కు 25 శాతం రాయితీ .. అనుమతి లేని లే అవుట్​లో 10 శాతం ప్లాట్లు

ఎల్ఆర్ఎస్​కు 25 శాతం రాయితీ .. అనుమతి లేని లే అవుట్​లో 10 శాతం ప్లాట్లు
  • రిజిస్టర్​అయితే.. మిగిలిన 90 శాతం ప్లాట్లకు అనుమతి
  • మార్చి 31 వరకు గడువు విధించిన ప్రభుత్వం.. సబ్​ రిజిస్ట్రార్లలోనే చెల్లింపులకు అవకాశం

హైదరాబాద్, వెలుగు : సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న ఎల్ఆర్ఎస్ (లే అవుట్​ రెగ్యులేషన్​ స్కీమ్​) అమలులో రాష్ట్ర ప్రభుత్వం  వేగం పెంచింది. అందులో భాగంగా ఎల్ఆర్ఎస్ కు 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఎల్ఆర్ఎస్​పై  బుధవారం సెక్రటేరియెట్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుదిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. 

అనుమతి లేని లేఅవుట్ లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి.. మిగిలిన 90  శాతం ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్​కు అవకాశం కల్పించారు. వీరు కూడా మార్చి 31 వరకు 25 శాతం రాయితీ పొందనున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసి.. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పించాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లే అవుట్లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు  వెసులుబాటు కల్పిస్తూ మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  

నిషేధిత జాబితా భూములపై జాగ్రత్త

ఎల్ఆర్ఎస్ అమలులో భాగంగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రులు అధికారులకు స్పష్టం చేశారు. వీటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎల్‌‌ఆర్‌‌ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.  25.70 లక్షల ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ దరఖాస్తులు రాగా, మున్సిపల్​శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 9 లక్షల అప్లికేషన్లను పరిష్కరించారు. 

అందులోనూ క్రమబద్ధీకరణకు అనుమతించినవి కేవలం లక్షా 73 వేలు మాత్రమే. ఈ సమావేశంలో సీఎస్​ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పురపాలక పట్టణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి,  హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.